డబుల్ ఇళ్ల పంపిణీపై పశ్చిమ ఎమ్మెల్యే వింత వైఖరి.. పూర్తయి నాలుగేళ్లైనా జాప్యం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ మూడేళ్లుగా అటకెక్కింది. పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ మూడేళ్లుగా అటకెక్కింది. పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ బాలసముద్రం అంబేద్కర్‌నగర్‌లో నిరుపేదల గుడిసెలు ఖాళీ చేయించి మరీ ఆ స్థలంలోనే 592 ఇళ్ల నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి మాత్రం తటపాటయిస్తోంది.
పంపిణీ విషయంలో ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మూడేళ్లుగా నాన్చుడు దోరణిని అవలంబిస్తున్నారంటూ పేదలు మండిపడుతున్నారు. దీంతో ఇళ్లు సిద్ధమైనప్పటికీ లబ్ధిదారులకు కేటాయింపు చేయడానికి మాత్రం చర్యలు చేపట్టకపోవడం ఎమ్మెల్యే వైఫల్యంగానే విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ జాప్యమవుతుండడంతో డబుల్ ఇళ్లు వస్తుందనే ఆశతో ఆ పక్కనే గుడిసెలు వేసుకుని ఏమాత్రం మౌలిక వసతులు లేకున్నా మూడేళ్లుగా కళ్లల్లో వొత్తులు వేసుకుని ఆశతో జీవిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నాలు జరిగినా వాయిదానే..
అంబేద్కర్ నగర్‌లో నిర్మాణం పూర్తయినా డబుల్ బెడ్రూం పంపిణీ చేపట్టాలని పేదలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఒకటి రెండుసార్లు ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని నిరసనకు దిగారు. పేదలు ఆందోళనకు దిగిన ప్రతీసారి సంబంధిత అధికారులను పంపించి బుజ్జగించి ఆందోళనను విరమించేలా చేస్తున్నారు తప్పితే పంపిణీకి మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ వద్దకు కొంతమంది పేదలు నేరుగా కలువడంతో స్పందించిన ఆయన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆరుగురు లబ్ధిదారులకు మాత్రమే అలాట్మెంట్ పేపర్లు అందించారు. కానీ ఇంతవరకు వారిని సైతం ఆయా ఇళ్లల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
డబుల్ బెడ్‌రూం.. పశ్చిమ ప్లాప్..!
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ విషయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వైఫల్యం చెందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పోల్చినప్పుడు కూడా ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు పంపిణీ చేయని ఏకైక ఎమ్మెల్యే వినయ్‌భాస్కరే కావడం విశేషం. సీఎం కేసీఆర్ 2015 జనవరి నెలలో హన్మకొండ అంబేద్కర్ నగర్‌లో పర్యటించి మురికి వాడలో జీవిస్తున్న పేదల కష్టాలకు చలించి వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ పనులు పూర్తవడానికి ఐదేళ్లు పడితే... ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడున్నరేళ్లు గడుస్తున్నా పంపిణీపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల సంఖ్య తక్కువగా, అర్హత కలిగిన వారు ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేయని వారి నుంచి వ్యతిరేకత వచ్చి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఏళ్లుగా పంపిణీని అటకెక్కిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఆలోచనలతో మొత్తం లబ్ధిదారుల ఎంపికనే పక్కకు పెట్టడం అర్హులైన పేదలకు అన్యాయం చేయడం కాదా? అన్న ప్రశ్నలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.