విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం...
రైతులను ఇబ్బందులు పెడితే కచ్చితంగా అధికారులపై చర్యలు తప్పవని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యుత్ అధికారులను హెచ్చరించారు.
దిశ, తొర్రూరు:- రైతులను ఇబ్బందులు పెడితే కచ్చితంగా అధికారులపై చర్యలు తప్పవని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యుత్ అధికారులను హెచ్చరించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల కేంద్రంలోని మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ లో విద్యుత్ శాఖ తొర్రూరు డిఈ మధుసూదన్, ఏడిఈ చలపతిరావు తో పాటు విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల్లో నెలకొని ఉన్న విద్యుత్తు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ... గ్రామాల్లో నెల కొని ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
లూజ్ లైన్ల సమస్య తీవ్రంగా ఉందని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. లూజ్ లైన్ సమస్యలు పరిష్కరించి మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ స్తంభాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉండడంతో ప్రాణహాని జరుగుతుందని సమీక్షలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్థాయిలో నెలకొని ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గ్రామస్థాయిలో విద్యుత్ అధికారులు రైతులతో కలిసి సమస్యను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రైతులకు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించి, రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్బన్ ఏ,ఈ జయప్రకాశ్ నారాయణ, రూరల్ ఏఈ మహేష్, మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, ఏఎంసి చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమ్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంచు సంతోష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మేకల కుమార్, వార్డు కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.