బీజేపీ చేపట్టింది నిరుద్యోగ మార్చ్ కాదు.. రాజకీయ నిరుద్యోగ మార్చ్ : అరూరి
బీజేపీ చేపట్టింది నిరుద్యోగ మార్చ్ కాదు ఇది రాజకీయ నిరుద్యోగ మార్చ్, నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో కాదు ఢిల్లీలోని మోదీ ఇంటి ముందు చేయాలన్నారు ఎమ్మల్యే ఆరూరి రమేష్.
దిశ, ఐనవోలు : బీజేపీ చేపట్టింది నిరుద్యోగ మార్చ్ కాదు ఇది రాజకీయ నిరుద్యోగ మార్చ్, నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో కాదు ఢిల్లీలోని మోదీ ఇంటి ముందు చేయాలన్నారు ఎమ్మల్యే ఆరూరి రమేష్. ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆరూరి మాట్లాడుతూ మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 9ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కనీసం 18లక్షల ఉద్యోగాలైన ఇచ్చారా.. ఇంకా సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పదో తరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డ బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ చేయటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల పేరుతో తెలంగాణను ఆగం చేయ్యాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ కుట్రలు చేస్తున్నాడన్నారు. ప్రపంచంలో అత్యంత అసమర్థ ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మోదీనే అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే నమ్మేందుకు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం బండి సంజయ్ కండ్లకు కనబడ్త లేదా పేపర్ లీకేజీల వెనక బీజేపీ నేతలు కార్యకర్తలు ఉన్నది వాస్తవం కాదా అన్నారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్ని ఉద్యోగాలిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు ఇయ్యని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఖబడ్దార్ బండి సంజయ్…పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యువతరం చైతన్యవంతమైనది మాయ మాటల బీజేపీని తెలంగాణ యువత బొందపెట్టేందుకు సిద్దంగా ఉందన్నారు.