దిశ, హన్మకొండ టౌన్: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేధికలను త్వరితగతిన పూర్తిచేసి అందజేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం హన్మకొండ కలెక్టరేట్‌లో పంట నష్టాల అంచనాలు, కరోనా వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి సుమారు 51 వేలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిని, 35 వేలకు పైగా రైతులు నష్టపోయినట్లుగా అంచనాలు అందాయని, దెబ్బతిన్న ఆయా పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తిస్థాయిలో నివేధికలు తయారు చేసి, త్వరగా అందజేయాలని సూచించారు. అత్యధికంగా మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, నర్సంపేట, పరకాల, భూపాలపల్లిల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి తాను ప్రత్యక్షంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగిందన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రాజకీయాలు చేయకుండా రైతులకు మనోధైర్యం కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు.