జంగాతోనే మా ప్రయాణం : కార్పొరేటర్ జక్కు రవి
మాజీ డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని ఆ పార్టీ నేత కట్ల శ్రీనివాస్ హెచ్చరించారు.
దిశ, హన్మకొండ టౌన్ : మాజీ డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని ఆ పార్టీ నేత కట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. వరంగల్ పశ్చిమలో జంగాకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నా పార్టీ అధిష్ఠానాన్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతల మనోభావాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల పై స్పష్టమైన సమాచారం తీసుకున్నాకే టికెట్ కేటాయించాలని ఆయన తెలిపారు. స్థానికంగా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమ అభిప్రాయాలను, మనోభావాలను అధిష్ఠానం పరిగణలోకి తీసుకుని జంగా రాఘవరెడ్డికే టికెటివ్వాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో మా కార్పొరేటర్లు, మా నాయకులనదరం కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. కాజీపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగా రాఘవరెడ్డికి మద్దతుగా కట్ల శ్రీనివాస్, కార్పోరేటర్ జక్కు రవి హాజరయ్యారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ టికెట్ ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలేదు... కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇదంతా కూడా ఓ మైండ్ గేమ్ అంటూ కొట్టిపారేశారు. మాకు న్యాయం జరగకపోతే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని అన్నారు. కష్టాల్లో మా వెన్నంటి నిలిచిన మా నాయకుడు జంగా రాఘవ రెడ్డియేనని, ఆయనకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని అన్నారు. టికెట్ ఇచ్చేముందు నాయిని రాజేందర్ రెడ్డి చరిత్ర ఏంటో పార్టీ పెద్దలు తెలుసుకోవాలని అన్నారు. జక్కుల రవి మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకునే నాయకుడు జంగా రాఘవరెడ్డి అని అన్నారు. 20 ఏండ్లుగా ఎమ్మెల్యే లేకున్నా క్యాడర్ ను కాపాడుకున్నామన్నారు. జంగావెంటే మా ప్రయాణం ఉంటుందని తెలిపారు.