దిశ ప్రతినిధి, వరంగల్/ఆత్మకూరు: అగ్రపహాడ్ జాతర ప్రాంగాణానికి సమీపంలో ఉన్న కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహా స్థూపాలను టీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటనపై మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె తనయురాలు సుస్మితా పటేల్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరుష పదజాలంతో ఆవేశంగా మాట్లాడారు. మా సొంత భూమిలో స్థూపం నిర్మించుకుంటే కూలగొట్టే హక్కు మీకెవరు ఇచ్చారంటూ చల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. కొండా కుటుంబంతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ''కాసుకో ఇక.. నువ్వు కేటీఆర్ గాడికి చెప్పుకుంటావో, కేసీఆర్‌కు చెప్పుకుంటావో చెప్పుకో.. నీ పతనం మొదలైంది'' అంటూ సుస్మితా పటేల్ ఆవేశంతో ఊగిపోయారు.
అనుహ్య ఘటన...
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రపహాడ్ మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించేందుకు శనివారం ఉదయం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు మండల ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. జాతరకు సమీపంలో ఉన్న కొండా మురళి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాల అడ్డుగా ఉన్నాయని, జాతరలో నిర్మించారంటూ కొంతమంది నేతలు ఆక్షేపించినట్లు సమాచారం. స్థూపాల వద్దకు చేరుకుని పరిశీలించిన ఎమ్మెల్యే ఆ తర్వాత సమీక్ష సమయంలో ఇదే విషయం ఒకరు ప్రస్తావించగా కూల్చేయాలని సూచించడం గమనార్హం. దీంతో స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు స్థూపాన్ని ధ్వంసం చేశారు. అయితే జేసీబీతో తొలగించేందుకు యోచించినా.. ఎందుకనో ఆగిపోయింది.
ఎమ్మెల్యేకు సురేఖ వార్నింగ్...
అగ్రపహాడ్‌లో స్థూపం కూల్చివేత సమాచారం తెలుసుకున్న కొండా సురేఖ..అగ్రంపహాడ్‌కు కూతురు సుస్మిత పటేల్‌తో చేరుకున్నారు. ధ్వంసమైన స్థూపాలను పరిశీలించిన ఇద్దరు అనంతరం అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆవేశంగా మాట్లాడారు. అంతకు ముందు శనివారం మధ్యాహ్నం కొండా సురేఖ ఓ సెల్ఫీ వీడియో, ఆడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రెస్‌మీట్, వీడియోలో సురేఖ మాట్లాడిన ప్రకారం.. ''అరేయ్ చల్లా ధర్మారెడ్డి.. నిద్రపోతున్న సింహాన్ని చల్లా ధర్మారెడ్డి లేపుతున్నాడని, ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నా చల్లా ధర్మారెడ్డి పతనం ఆరంభమైందని పేర్కొన్నారు.'' ప్రజలు తిరగబడి తరిమికొట్టే రోజులు వస్తున్నాయని హెచ్చరించారు. మా సొంత భూముల్లో మా అత్తమామల స్థూపాన్ని నిర్మించామని ఈ సందర్భంగా వివరించారు. తాను పరకాల ఎమ్మెల్యేగా, కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే అగ్రంపహాడ్‌లో మూడెకరాలకు పైగా స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ ప్రాంత ప్రజల జాతర సౌకర్యార్థం ఉంచినట్లు తెలిపారు. అది దేవాదాయ శాఖకు అప్పగించలేదని, కూతురు సుస్మితా పటేల్ పేరు మీదనే తమ వద్ద కాగితాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందిన నాటి నుంచి విగ్రహాలను తొలగించాలని పలుమార్లు యత్నించాడని గుర్తుచేశారు. గతంలోనూ ఇదే విధమైన ప్రయత్నం చేశాడని, అప్పుడు కలెక్టర్ వాకాటి కరుణ వారించారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కావాలనే దేవాదాయ శాఖ అధికారులకు కూల్చేసేవిధంగా ఆదేశాలిచ్చాడని తెలిపారు. ధరణి పోర్టల్‌లో అనేక తప్పులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందేనని, అందులో భాగంగానే మా భూములను దేవాదాయ శాఖ భూములుగా పేర్కొన్నారని తెలిపారు.
సిగ్గు శరం లేదని ఎమ్మెల్యే: సుస్మితా పటేల్
చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యే ఎట్లాయ్యాడో తెలియడం లేదంటూ కొండా సుస్మితా పటేల్ ఎద్దేవా చేశారు. నా పేరున పట్టా ఉన్న భూమిలోకి అడుగుపెట్టడానికి నువ్వెవరు అసలు. ఇది ప్రజాస్వామ్యం కాదా..? ఇంత నియంతృత్వమా? అంటూ ప్రశ్నించారు. కొండా కుటుంబంతో పెట్టుకోకు ధర్మారెడ్డి.. నీకు అస్సలు మంచిది కాదు... పెట్టుకుంటే నీ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంటుందో ఊహకు కూడా అందదు అంటూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. రేపు వెంటనే ధ్వంసమైన స్థూపాన్ని తిరిగి నిర్మించి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ఊరుకునేది లేదని అన్నారు. అంతకు ముందు కొండా సురేఖ ఘటన స్థలానికి వస్తున్న విషయం తెలుసుకున్న వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కొండా అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
చల్లా ధర్మారెడ్డి ఫ్లెక్సీలను చించేసిన కొండా అనుచరులు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొండా దంపతుల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. మా అనుమతి లేకుండా తమ భూమిలో ఏర్పాటు చేసినందుకే ఎమ్మెల్యే ప్లెక్సీలను చించేస్తున్నట్లు కొండా సురేఖ చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా, కొండా కుటుంబానికి అనుకూలంగా నినాదాల చేయడం కనిపించింది. ఇక స్థూపాన్ని ధ్వంసం చేసిన నలుగురైదుగురు టీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగడం గమనార్హం. ఇదిలా ఉండగా స్థూపాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించారంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఆత్మకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు కొండా సురేఖ యోచిస్తున్నట్లు సమాచారం.