కేసీఆర్ అబద్దాల కోరు : ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
కేసీఆర్ అబద్దాల కోరు అని, ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలకి, అసెంబ్లీలో, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలలో మాట్లాడిన మాటలకి సంబంధం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
దిశ, భీమదేవరపల్లి : కేసీఆర్ అబద్దాల కోరు అని, ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలకి, అసెంబ్లీలో, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలలో మాట్లాడిన మాటలకి సంబంధం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రజాగోస...బీజేపీ భరోసాలో భాగంగా శుక్రవారం మండలంలోని ముల్కనూర్ గ్రామంలో బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు పృథ్విరాజ్ అధ్యక్షతన నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వందల, వేల కోట్లు ఉన్న వారికే పరిహారం కట్టబెట్టే కేసీఆర్, గౌరవెల్లి ప్రాజెక్టులో కూడు, గూడు, గుడ్డ కోల్పోయిన భూ నిర్వాసితులకు మాత్రం పరిహారం ఇవ్వడం లేదన్నారు. సర్వం కోల్పోయిన భూనిర్వాసితులు పరిహారం ఇవ్వమని అడిగితే పోలీసులతో లాఠీ చార్జి చేయించి వారి రక్తం కళ్లజూసి జైలు పాలు చేశారని విమర్శించారు.
భూ నిర్వాసితులు చిందించిన రక్తం సాక్షిగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటితాయి తప్ప, కాళ్లు మాత్రం తంగళ్లు దాటవని ఎద్దేవా చేశారు. దళిత బంధు రాలే... డబుల్ బెడ్ రూమ్ రాలే... నిరుద్యోగ భృతి రాలే... కానీ బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి కోట్ల రూపాయలు వచ్చాయని విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి సహకారం, కృషి అందిస్తానని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పదిమంది నాయకులు ఉన్నా నిలబడేది ఒక్కరే, గెలిచేది బీజేపీనే అని, హుస్నాబాద్ గడ్డపై కాషాయపు జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా అన్నారు.
అనంతరం వివిధ పార్టీల నుండి బీజేపీలోకి చేరిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటెల ఆధ్వర్యంలో సుమారు 2000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మండల అధ్యక్షుడు పైడిపల్లి పృధ్విరాజ్, మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల ప్రకాష్, మాట్ల మొగిలి, నేతుల మోహన్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.