అధికారుల కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు.. చర్యలు తీసుకోకపోవడానికి కారణమిదే!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మునిసిపాలిటీ కేంద్రంగా కొనసాగుతున్న మహబూబాబాద్‌లో అక్రమాల ప్లానింగ్ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అక్రమ లే అవుట్లు పుట్టుకొస్తున్నా టౌన్ ప్లానింగ్
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మునిసిపాలిటీ కేంద్రంగా కొనసాగుతున్న మహబూబాబాద్‌లో అక్రమాల ప్లానింగ్ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అక్రమ లే అవుట్లు పుట్టుకొస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. క్రమ పద్ధతిలో పట్టణాభివృద్ధి, ఇళ్ల నిర్మాణం జరగడంపైనే పూర్తి ఫోకస్ చేయాల్సిన అధికారులు.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, అక్రమ లే అవుట్లు పుట్టుకొస్తున్నా మౌనంగా ఉండిపోతుండటం గమనార్హం. విలీనమైన గ్రామాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలు కొనసాగుతుండగా, పట్టణంలో వాణిజ్య భవనాలు, పెద్ద భవనాలు అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా జరుగుతుండటం గమనార్హం.
బహిర్గతమవుతున్న బాగోతాలు
ఇంటి ప్లాన్ల విషయంలో మరిన్ని బాగోతాలు బహిర్గతమవుతున్నాయి. వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న యజమానులు మునిసిపాలిటీకి ఆదాయాన్ని ఎగ్గొంటేందుకు తప్పుడు ప్లాన్లు రూపొందించి, అధికారులకు కొంత ముట్టజెప్పి ఆమోద ముద్ర వేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దండిగా ముడుపులు ముడుతుండటంతో ఎవరు చూస్తారులే అన్న ధీమాతో యజమానులు కోరిన విధంగా ప్లాన్లను అధికారులు ఆమోదిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరికొందరు పలుకుబడి ఉన్నవారు తమనెవరు పట్టించుకుంటారులే అన్న నిర్లక్ష్య వైఖరితో కనీసం అనుమతికి దరఖాస్తు కూడా చేయడంలేదని స్పష్టమవుతోంది. పట్టణంలో రోడ్ల అక్రమణలు జరిగినా, రోడ్డు మధ్య వరకు ర్యాంపులు కట్టినా, ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించకున్నా, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టినా, పార్కింగ్ కోసం వదిలిన సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
అధికారులకు కాసుల పంట..!
మానుకోట మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత క్రమంగా జరుగుతున్న అభివృద్ధితో నగరం చుట్టూ రియల్ భూం పెరుగుతూ వస్తోంది. ఎకరం లక్షల్లో ఉన్న భూములకు కోట్లల్లో ధర పెరిగింది. అక్రమ నాన్ లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, వెంచర్లపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అనుమతిలేని నిర్మాణమైనా అధికారుల చేతులు తడిపితే సరిపోతుందనే ఉద్దేశంలో నిర్మాణదారులుండటం గమనార్హం.
నిర్మాణం లెక్కనా..!
ఒక్కో అక్రమ నిర్మాణానికి ఒక్కో రేటు లెక్కన వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇన్‌చార్జి అధికారి పర్యవేక్షణ లోపం కూడా ఈ అక్రమాలకు ఊతం ఇచ్చినట్టవుతోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇస్టానుసారం వెంచర్లు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలు చేపట్టే ప్లాట్ విస్తీర్ణం, ఎంత మేరకు నిబంధనలు ఉల్లంఘించారనే దానిపై అధికారులు అంచనా వేస్తూ అంతమేరకు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎన్ని భవనాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు..? భవన నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? ప్రభుత్వానికి చెల్లించ వలసిన ఫీజులు చెల్లించారా లేదా? భవన నిర్మాణ యజమానులు ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారా..? అన్న విషయంపై శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.