కాలువ గట్టు ఖతం.. పొతం పెట్టే ప్రయత్నాలు..!
ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు.. గుడిసెలు వేయడం పరిపాటిగా
దిశ,వరంగల్ టౌన్ : ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు.. గుడిసెలు వేయడం పరిపాటిగా మారింది. రోడ్డు వెంట గజం స్థలం దొరికినా ఏదో ఒక బేరానికి డేరాలు వేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి ఆక్రమణలు నగరంలో నిత్యకృత్యంగా మారాయి. కళ్లముందే ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతోంది. తీరా ఆ స్థలం వివాదస్పదంగా మారిన తర్వాత ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ రణరంగానికి ఆజ్యం పోస్తున్నారు. ఖాళీ జాగల పరిరక్షణ విషయంలో అధికారులు ప్రణాళిక యుతంగా చర్యలు చేపట్టకపోవడంతోనే కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
తాజాగా, వరంగల్ నగరం దేశాయిపేట ఏరియాలోని కాకతీయ కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో కబ్జా కోరలు విచ్చుకుంటున్నట్లు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. కొంతకాలం క్రితం కాలువను ఆనుకుని ఒకరు గుడిసె వేసి చిన్నపాటి టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దానికి పది మీటర్ల దూరంలో సారీ సెంటర్ పేరిట ఒక డబ్బా వెలిసింది. ఇటీవలి కాలంలో కాలువ కట్టను ఆనుకుని మరిన్ని వ్యాపారాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థలంలో కొన్ని పాతకార్లు పార్కింగ్ చేసి ఉండగా, మొరం కుప్పలు, మట్టి కుప్పలు, కట్టెలు పాతిన ఆనవాళ్లు.. మొత్తంగా కబ్జాకు అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇంతకు ఆ స్థలం ఎవరిది..?
దేశాయిపేట ప్రతాపరుద్ద ఫిల్టర్‌బెడ్ నుంచి ఆటోనగర్ వెళ్లే మార్గంలో ఒకప్పటి మున్సిపల్ వాటర్ పంప్ హౌస్ సమీపంలో కాకతీయ కెనాల్ కట్ట కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇంతకు ఆ స్థలం ఎవరిది? కెనాల్‌కు సంబంధించిందా? వరంగల్ మహానగర పాలక సంస్థకు చెందినదా? లేదంటే ప్రభుత్వ స్థలమా? అనే విషయం తేలాల్చి ఉంది. ఒకవేళ కెనాల్‌కు చెందిన స్థలం అయితే, నీటిపారుదల శాఖ నిద్రపోతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక వరంగల్ బల్దియాకు చెందినదైతే కార్పొరేషన్‌ను కళ్లున్న కభోదిగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వంది అయితే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏదిఏమైనా ఏ శాఖ అధికారైనా మొద్దు నిద్ర వీడి ఆ స్థలం పూర్తిగా కబ్జారాయుళ్ల చేతిలోకి వెళ్లకముందే తేరుకుంటే మంచిదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ముఖ్యంగా ఆ స్థలంలో ఏ షాపు, ఏ వ్యాపారం వెలిసినా అందుకు బల్దియా నుంచి ట్రేడింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇప్పటికే బల్దియా అధికారులపై బోలెడన్నీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. కబ్జాకు గురవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్న ఈ స్థలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత వరంగల్ మహానగర పాలక సంస్థపైనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.