ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టుకొస్తుంది..: కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎందుకు
దిశ,జనగామ : ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెడతాడని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసమని, తాము రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని ఛాగల్లులో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ దశలవారీగా రూ.5016 కు పెంచుతామని, ఇప్పటికే అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఎంతోమంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి ప్రసూతి చేయించి కెసిఆర్ కిట్టు అందజేశామని చెప్పారు. అలాగే మగ పిల్లవాడు పుడితే రూపాయిలు రూ.12000 ఆడపిల్ల పుడితే రూ.13000 చెల్లించడం జరిగిందన్నారు. గ్రామాల్లో నీళ్ల బాధలు లేవని, సర్పంచులు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడ్డారని, వాటన్నింటి బాధలనుండి అధిగమించి మిషన్ భగీరథని తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలను కూడా పారదూలమని చెప్పారు. కృష్ణ గోదావరి నడి మధ్యలో ఉన్న స్టేషన్ ఘన్పూర్ కు కాంగ్రెస్ నాయకులు నీళ్లు తీసుకురాలేకపోయారని అన్నారు. అయినా మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని గ్రామాల్లో చర్చ పెట్టి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఒకప్పుడు లింగాల గణపురం మండలంలో ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య నీళ్ల కోసం 58 బోర్లు వేసి తను సంపాదించిందంతా బోర్ల కోసమే ఖర్చు చేశాడని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు.
దేవాదులను నీళ్లు ఇవ్వకపోతే తానే పిండాలు పెట్టి వచ్చానని, అలాంటిది ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్లో లక్ష పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఆయన అన్నారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడి వాడే కావడంతో ఆయన కూడా అభివృద్ధి కోసం తనతో కొట్లాడాడని అన్నారు. కడియం శ్రీహరి ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి అని, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన ఎంతో అభివృద్ధి చేశాడని కెసిఆర్ అన్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులను మరమత్తు చేసుకొని చెక్ డాంలను నిర్మించుకున్నామని నీటి సదుపాయం భారీగా పెరిగాయని అన్నారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రాజెక్టు నీళ్లకు పన్నులు వసూలు చేస్తున్నారని తెలంగాణలో లేవని, సాగునీరు అందించడంతోపాటు రైతుబంధు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా రైతులు మరణిస్తే కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు రైతు బీమాపెట్టామని,ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని, 50 ఏళ్ల కాంగ్రెస్ సక్కగా ఉంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెడతారు అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు వద్దు,మూడు గంటలు చాలు, 10 హెచ్.పి మోటార్లు పెట్టాలి, రైతుబంధు వృధా అంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? బీఆర్ఎస్ కావాలో? ప్రజలు గ్రామాల్లో చర్చించి ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ధరణి తీసేస్తారని, మళ్లీ పాత పద్ధతి అమల్లోకి వస్తుందని, రెవెన్యూ అధికారులు, వీఆర్వోల, అవినీతి మళ్లీ పెరుగుతుందన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో రిక్షా కార్మికులకు ఫిట్నెస్ రద్దు చేస్తారని కూడా హామీ ఇచ్చారు. కడియం శ్రీహరిని గెలిపించాలని, డాక్టర్ రాజయ్య కూడా సముచిత స్థానమే ఉంటుందని అన్నారు. అంతకు ముందుగా సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ తాను గణపురం ప్రజల భిక్షతో 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నానని, 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని,తనను ఆదరించి గెలిపించాలని, నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు.అదేవిధంగా ఘన్ పూర్ కు అవసరమైన పాలిటెక్నిక్ కళాశాల 100 పడకల ఆసుపత్రి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దాదాపు 60 వేలకు పైగా ప్రజల ఈ సభకు హాజరై ఉంటారని భావిస్తున్నారు. ఈ సభకు జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, పార్టీనాయకులు మారు జోడు రాంబాబు, వారాల రమేష్, నామాల బుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.