కాకతీయ వనవిహార్ లో భారీ అగ్ని ప్రమాదం..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి ఎల్కతుర్తి లోని కాకతీయ వనవిహార్ పార్కులో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
దిశ, భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి ఎల్కతుర్తి లోని కాకతీయ వనవిహార్ పార్కులో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్కు నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎల్కతుర్తి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజన్ల సాయంతో 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో పార్కులోని వెదురు చెట్లు పూర్తిగా దగ్ధం కావడం వల్ల భారీగా అటవీ సంపదకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కన దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర పొగలు వ్యాపించాయి. జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.