వ‌రంగ‌ల్ జిల్లాలో కుండ‌పోత‌.. ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాలు అత‌లాకుత‌లం

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం కొన‌సాగుతోంది. శ‌నివారం రాత్రి నుంచి మొద‌లైన వ‌ర్షం ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తుండ‌టంతో ములుగు, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

Update: 2024-09-01 05:55 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం కొన‌సాగుతోంది. శ‌నివారం రాత్రి నుంచి మొద‌లైన వ‌ర్షం ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తుండ‌టంతో ములుగు, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. మ‌హ‌బూబాబాద్‌, ములుగు జిల్లాల్లో వాగులు, వంక‌లు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తుండ‌టంతో వంద‌లాది గ్రామాల‌కు ర‌వాణా వ్య‌వ‌స్థ దెబ్బ‌తింది. మ‌రిపెడ మండ‌లం పురుషోత్త‌మ‌య‌గూడెం బ్రిడ్జి వ‌ద్ద వ‌ర‌ద ఉధృతికి ఖ‌మ్మం జిల్లా కారేప‌ల్లి మండ‌లం గంగారం తండాకు చెందిన తండ్రి కూతూర్లు నునావ‌త్ మోతీలాల్‌, అశ్వినీలు కొట్టుకుపోయారు. స్వ‌గ్రామం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి కారులో వెళ్తుండ‌గా ఈ విషాద సంఘ‌ట‌న జ‌రిగింది. తొర్రూర్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన నరసయ్య చెరువులో శ‌నివారం సాయంత్రం చేప‌ల వేట‌కు వెళ్లి ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇంటిక‌న్నె వ‌ద్ద రైల్వే ట్రాక్ వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయింది. కేస‌ముద్రం మండ‌లంలోని ఇళ్లు నీట‌మునిగాయి. వ‌ర‌ద‌లో చిక్కుకున్న వంద‌లాది మంది బాధితులు స‌హాయం కోసం ఎదురు చూస్తున్నారు.

 

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో కుంభ‌వృష్టి..!

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో కుంభ‌వృష్టి కొన‌సాగింది. జిల్లాలోని గంగారం మండ‌లం మిన‌హా అన్ని మండ‌లాల్లో 150.మి.మీ.కు పైగా వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కొత్త‌గూడ 162.4, గంగారంలో 68.2, బ‌య్యారం 180.0, గార్ల 174.4, డోర్న‌క‌ల్ 262.4, కుర‌వి 354.2, మ‌హ‌బూబాబాద్ 374.8, గూడూరు 254.0, కేస‌ముద్రం 377.2, నెల్లికుదురు 469.6, న‌ర్సింహుల‌పేట 405.6, చిన్న‌గూడూరు 450.6, మ‌రిపెడ 352.4, దంతాల‌ప‌ల్లి 354.2, తొర్రూరు 262.4, పెద్ద‌వంగ‌ర 245.4మి.మీ.రికార్డు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జిల్లాలో మొత్తం 4747.3 మి.మీ న‌మోదు కాగా జిల్లా స‌గ‌టు వ‌ర్ష‌పాతం 296.7గా న‌మోదైంది. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, నెల్లికుదురు, కుర‌వి, మ‌రిపెడ మండ‌ల‌కేంద్రాలు నీట మునిగాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాలేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. పెద్దవంగర మండలంలోని విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.

 

ములుగులో రికార్డు వ‌ర్షపాతం న‌మోదు..!

ములుగు జిల్లాలో మొత్తం 1021.6మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా జిల్లా సగ‌టు వ‌ర్ష‌పాతం 113.5గా న‌మోదైంది. తాడ్వాయి మండ‌లంలో రికార్డు స్థాయిలో 260.8మి.మీ.వ‌ర్షం కురిసింది. ఏటూరునాగారం మండ‌లంలో 235.4, గోవింద‌రావుపేట మండ‌లంలో 151.8 వ‌ర్షం న‌మోదైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం-వరంగల్ జాతీయ ర‌హ‌దారి 163పై రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు మండలంలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలో ఉన్న‌ బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలో ప‌లుచోట్ల పిడుగులు ప‌డ‌టంతో ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. తాడ్వాయి మండ‌లంలోని దొడ్ల, ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగపేట మండ‌లకేంద్రం-బోరునర్సాపురం గ్రామాల మధ్య గౌరారం వాగు ఉధృతి కొన‌సాగుతోంది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం నిండుకుండ‌లా మారి మ‌త్త‌డి దుంకుతోంది. నూగూరు వెంకటాపురం మండలం మొర్రవానిగూడెంలో ఓ ఇల్లు కూలిపోయింది. జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి, శంకరంపల్లి, బొప్పారం, దామెరకుంట తదితర గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి.

 

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

మ‌హ‌బూబాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స‌హాయం, ఫిర్యాదుల‌కు 7995074803లో సంప్ర‌దించాల‌ని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్ లో (24) గంటలు నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన ఈ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని అన్నిశాఖ‌ల అధికారులు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

వ‌రంగ‌ల్‌లో నీట మునిగిన కాల‌నీలు..!

జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోని వంద‌లాది కాల‌నీలు ఎప్ప‌టిలాగే నీట మునిగాయి. వరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్వో ఇక్బాల్‌ తెలిపారు. వరంగల్‌ మండల పరిధిలోని ముంపు ప్రాంతాలైన‌ ఎనుమాముల, బాలాజీనగర్, చాకలి ఐలమ్మనగర్, హంటర్‌రోడ్డు ప్రాంతంలోని సాయినగర్, ఎన్టీఆర్‌ నగర్‌ లోతట్టు ప్రాంత ప్ర‌జ‌లు ఖాళీ చేయించి పున‌రావ‌స కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. వ‌రంగ‌ల్ త‌హీసీల్దార్ కార్యాల‌యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు స‌హాయార్థం 70136 26828 నెంబ‌ర్‌కు కాల్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.


Similar News