ఓరుగల్లును ముంచెత్తిన వర్షం..పడవల్లో పరామర్శలు, వరద నీటిలో ఓదార్పులు

పాత కథే. వరంగల్‌ నగరాన్ని ఈ వర్షాకాలం కూడా ముంచేసింది. వారం రోజులుగా కురుస్తున్న వానలకు పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఎప్పటిలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు గాలివానలో.. వాన నీటిలో పడవ ప్రయాణాలు

Update: 2023-07-26 05:14 GMT

దిశ,వరంగల్‌ టౌన్‌ : పాత కథే. వరంగల్‌ నగరాన్ని ఈ వర్షాకాలం కూడా ముంచేసింది. వారం రోజులుగా కురుస్తున్న వానలకు పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఎప్పటిలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు గాలివానలో.. వాన నీటిలో పడవ ప్రయాణాలు చేస్తూ ముంపు ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు కదలివచ్చారు.బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కుస్తీ పట్లుపట్టారు.గతంలో చెప్పినట్లుగానే శాశ్వత పరిష్కారం చూపుతామంటూ కంటితుడుపు మాటలు చెప్పి వెళ్లిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు కోట్లు మునిగినట్టే!

వర్షాకాలం ప్రారంభానికి ముందే వరంగల్‌ నగరంలోని నాలాలను శుభ్రపరిచేందుకు గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఏటా నిర్వహించినట్లుగానే ఈ సారి కూడా నగరంలోని ప్రధాన నాలాల్లో పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు పనులు చేపట్టారు. ఇందుకోసం బల్దియా రూ.3కోట్లు కేటాయించింది. అన్ని కోట్లు పెట్టినా నాలాల్లో వరద నీరు సమీప కాలనీలను ముంచేసింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట నగరంలో సుమారు 30 కాలనీల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రాలేని దుస్థితి నెలకొంది. వానలు ముంచుకొస్తున్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా... బల్దియా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు ముంపులో చిక్కుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు కోట్లు ఖర్చు చేసి.. నాలాలను క్లీన్‌ చేస్తే వరద ఇళ్లలోకి ఎందుకు వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం కంటితుడుపు చర్యల వల్లే ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మూడు కోట్లు వరదపాలయినట్లేనని మండిపడుతున్నారు.

అసలు కారణమేంటి?

వరంగల్‌ నగరాన్ని వానలు ఏటా ముంచుతున్న అసలు కారణాలను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నీ ఒకప్పటి చెరువులు, కుంటల కింద ఉన్న స్థలాలేనని, ఆ ప్రాంతాలను కొందరు రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసి ఆవాస ప్రాంతాలుగా మార్చడం వల్లే నగరానికి ముంపు సమస్య తలెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ నగరంలో పలు నాలాలను కబ్జా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. బల్దియా గ్రీవెన్స్‌లో ఇలాంటి ఫిర్యాదులు అందినా అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ నగరంలోని చెరువులకు కనీసం హద్దులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించని అధికారులు.. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఏటా వర్షాకాలంలో సురక్షిత ప్రాంతాలంటూ కంటితుడుపు చర్యలతో నగరాన్ని మరింత ముంచుతున్నారని మండిపడుతున్నారు.

వరదలో వరుస కట్టిన నేతలు

వరుస వర్షాలతో నీట మునిగిన పలు కాలనీల్లో అధికార పార్టీ నేతలు, బల్దియా అధికారులు, పోలీసులు వరుస పెట్టి పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, కలెక్టర్‌ ప్రావీణ్య, బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ భాషా, పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తదితరులు ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గరీభ్‌నగర్‌, మైసయ్యనగర్‌, నాగేంద్రనగర్‌, కీర్తిబార్‌, బొందివాగు నాలా, వివేకానందకాలనీ, సంతోషిమాత కాలనీ, బృందావన్‌కాలనీతోపాటు పలు కాలనీల్లో ముంపు బాధితులను ట్రాక్టర్లు, పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Similar News