నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు.. ముమ్మరంగా పోలీస్ కూంబింగ్

సీపీఐ(మావోయిస్టు) 20వ, మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించాలంటూ మావోయిస్టు అగ్రనేతలు పిలుపునివ్వడంతో మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-09-21 06:03 GMT

దిశ, మంగపేట: సీపీఐ(మావోయిస్టు) 20వ, మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించాలంటూ మావోయిస్టు అగ్రనేతలు పిలుపునివ్వడంతో మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోమటిపల్లి, తొండ్యాల లక్ష్మీపురం, కొత్తూరు మొట్లగూడెం, బుచ్చంపేట, నర్సాయిగూడెం,బాలన్నగూడెం, నర్సింహాసాగర్, పూరెడుపల్లి, మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, వాగొడ్డుగూడెం, రామచంద్రుని పేట, నిమ్మగూడెం, దోమెడ పంచాయతీల పరిధిలో అటవీ గ్రామాల్లో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు వాడ వాడల్లో జరిపి అమరులను స్మరించుకోవాలని మావోయిస్టు కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అడవులను గొత్తికోయలు ఆవాసాలున్న అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు

మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని విఫలం చేసేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. మంగపేట మండలం తో పాటు ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు, వెంకటాపురం(నూగూరు)మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు గ్రీన్ హంట్ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల్లో గొత్తికోయలున్నారనే సమాచారం మేరకు అటవీ ప్రాంతాల్లో వారి ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని గూడాల్లో మావోయిస్టుల వాల్ పోస్టర్లు అంటించి సోదాలు, కార్డన్ సెర్చ్‌లు చేస్తూ అనుమానితుల సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. గొత్తికోయల తో సమావేశమై పరిచయం లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరిస్తున్నారు.

ఆందోళనలతో అట్టుడుకుతున్న మండలం

ఆవిర్భావ దినోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు విఫలం చేసే పనితో పోలీసులు నిత్యం అటవీ గ్రామాల్లో సోదాలు తనిఖీలు చేస్తుండడంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని యువకులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారక ముందే పోలీసులతో తెల్లవార్లు మావోయిస్టుల భయం వెంటాడుతుండడంతో యువకులు గ్రామాలను విడిచిపోతున్నారు. మండలంలో గతంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న కమలాపురం, తిమ్మంపేట, నర్సింహాసాగర్, రామచంద్రుని పేట, రాజుపేట పంచాయతీ లపై పోలీసుల నిఘా పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు ముగిసే వరకు గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆందోళన చెందుతున్నారు.


Similar News