మా మొర ఆలకించండి మహాప్రభో..
ప్రాథమిక విద్యను ఉన్నత విద్యకు మధ్య పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ భారత రాజ్యాంగం 86వ సవరణ చేసింది.
దిశ, డోర్నకల్ : ప్రాథమిక విద్యను ఉన్నత విద్యకు మధ్య పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ భారత రాజ్యాంగం 86వ సవరణ చేసింది. అందులో భాగంగానే నిర్ణీత కాల పరిధిలో విద్య అందించటమే లక్ష్యంగా సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని 2000-2001లో ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిధులు వెచ్చిస్తున్నాయి. అనుకున్నదే తడవుగా రాత పరీక్ష ద్వారా సర్వ శిక్ష అభియాన్ బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిన ఎంపిక చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో భాగంగా విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది నిర్ణిత జీతభత్యాలతో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
అర్హతలున్న ప్రయోజనం శూన్యం..!
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్ష ఎదుర్కొని మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రకారం నియామకాలు జరిపారు. వీరి నియామకం నుంచి నేటీ వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృష్టి చేస్తునప్పటికీ ఇంక్రిమెంట్ లేక పోవడంతో పాటు మినిమం టైం స్కేల్ అమలు కాకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి ప్రభుత్వాల వివక్షకు గురవుతున్నా.. పెరిగిన ధరలకు చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. క్రమబద్ధీకరణకు అర్హతలు ఉన్న ప్రయోజనం లేదు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం..
గత ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదు. ఏడాది క్రితం వరంగల్ ఏకశిలా పార్క్ వద్ద 30 రోజులుగా ధర్నా చేస్తున్న సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి శిబిరాన్ని సందర్శించి కీలక హామీ ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ వస్తే బతుకులు బాగుపడతాయని ఆశించిన విద్యాశాఖ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 17 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికైనా తమ వెతలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
విద్యాశాఖలో విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.. టీఎస్ యుటీఎఫ్ కేజీబీవీ, యుఆర్ఎస్ రాష్ట్ర కోశాధికారి ఎం.మంజుల
తెలంగాణ ప్రభుత్వ విద్య శాఖలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంత వరకు సుప్రీంకోర్టు సూచించిన విధంగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అమలు చేయాలంటున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షలు జీవిత బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలంటున్నారు. విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలంటున్నారు.
అన్నింట మేటిగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.. కురవి కేజీబీవీ ప్రత్యేక అధికారి సరస్వతి
కేజీబీవీ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను తమ పిల్లలుగా భావించి విద్యా, క్రమశిక్షణ, క్రీడలు, సామాజిక స్పృహ అన్నింట మేటిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉత్తమ ఫలితాలు అందిస్తున్నామన్నారు. హాలిడే, నైట్ డ్యూటీలు, అరకొర క్యాజువల్ లీవ్స్, నిర్ణీత జీత భత్యాలతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరిచ్చిన మాటను అమలుపరిచి వెలుగులు నింపాలంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం.. డోర్నకల్ కేజీబీవీ ప్రత్యేక అధికారిని మున్ని
ఏండ్ల తరబడి అరకొర జీతాలతో కాలం వెలదీస్తున్నామన్నారు. కుటుంబాలను వదిలి అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతున్నామన్నారు. ఏడాది క్రితం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ధైర్యాన్నిచ్చారు. సమస్య పరిష్కరిస్తానని కీలక హామీ ఇచ్చారు.విద్యాశాఖలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
పాఠశాలల్లో కేర్ టేకర్లను నియమించాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నామన్నారు. క్రమబద్దీకరించేంత వరకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరారు.
మీరిచ్చిన మాటే కదా.. ఏడాదిగా ఎదురుచూస్తున్నాం.. తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం మానుకోట జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న
గత ఏడాది సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని అప్పటి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సందర్శించి క్రమబద్ధీకరణకు కీలక హామీ ఇచ్చారన్నారు. టీ తాగే లోపల పరిష్కారమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సమస్య పరిష్కరించి ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతానని మాటిచ్చారు. ఏడాదిగా ఎదురు చూస్తున్నామన్నారు. మీరిచ్చిన మాటే కదా సీఎం రేవంత్ రెడ్డి సార్ అమలుపరిచి ఆదుకోవాలని కోరారు.