ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ర్యాగింగ్ భూతానికి బలైన కాకతీయ మెడికో ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Update: 2023-03-17 11:00 GMT

దిశ, దేవరుప్పుల (కొడకండ్ల): ర్యాగింగ్ భూతానికి బలైన కాకతీయ మెడికో ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం పరిధి గిర్ని తండాలో ప్రీతి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి, ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీతి కుటుంబ సభ్యులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 20 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రీతి మృతికి కారణమైన వారికి చట్ట పరంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. న్యాయం చేయాలని కోరడంలో తప్పులేదు కానీ, వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఈ ఘటనను వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే రూ.10 లక్షలు ఇస్తామని, అలాగే ప్రీతి సోదరుడు, సోదరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రీతి మృతికి కారణమైన వారికి శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని ప్రీతి తల్లి వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, సిందే రామోజీ, తీగల దయాకర్ గౌడ్, తొర్రూరు మండల జడ్పీటీసీ శ్రీనివాస్, కొడకండ్ల మండల జడ్పీటీపీ కేలోతు సత్తమ్మ, పాలకుర్తి మండల జడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ రావు, కొడకండ్ల మండల ఎంపీపీ దరావత్ జ్యోతి నాయక్, గిర్ని తండా సర్పంచ్ రాజ్ కుమార్, మాజీ జీసీసీ చైర్మన్ దరావత్ గాంధీ నాయక్, జిల్లా నాయకులు పల్ల సుందర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News