దేవాదుల‌పై ఉత్తమ్ వి ఉత్త మాటలే.. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

Update: 2024-08-31 13:52 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : దేవాదుల ఎత్తిపోతల ప‌థ‌కంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్త మాటలే అని బీఆర్ఎస్ పార్టీ హ‌న్మ‌కొండ‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్ర‌భుత్వ చీఫ్‌ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే ప్రాజెక్టు వ్య‌యాన్ని 10వేల కోట్ల‌కు పెంచుకుని జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌న‌య‌జ్ఞం చేశారంటూ ఆరోపించారు. కేసీఆర్ చొర‌వ‌తోనే దేవాదుల ప్రాజెక్టుకు స‌వ‌ర‌ణ‌లు చేసి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్రాజెక్టును దాదాపు 90శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. శుక్ర‌వారం రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి, పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి సీత‌క్క స‌మ్మ‌క్క సాగ‌ర్‌ను సంద‌ర్శించి దేవాదుల ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై స‌మీక్ష పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడార‌న్నారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో విన‌య్‌భాస్క‌ర్ మాట్లాడారు. రూ.2100 కోట్లతో 2017లో శంకుస్థాపన చేసి 2022లో పూర్తి చేస్తామని చెప్పడం గుర్తు లేదా అంటూ క‌డియంను ఉద్దేశించి అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉత్త మాటలే చెప్తున్నారని, ఆయన పక్కన ఉండి కూడా కడియం శ్రీహరి మాట కూడా మాట్లాడలేదన్నారు.

మంత్రి ఉత్తమ్ జైలుకెళ్ల‌డం ఖాయం : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌ కేసీఆర్ ప్రభుత్వ హాయాంలోనే దేవాదుల ప్రాజెక్టును 90% పూర్త‌యిన‌ట్లు తెలిపారు. ఐనా ప్రాజెక్టు ప‌నులు ఇంకా చాలా వ‌ర‌కు పెండింగ్ ఉన్న‌ట్లుగా మంత్రులు మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ఎస్సారెస్పీ పనితోపాటు జలయజ్ఞం డబ్బులను కూడా కాంగ్రెస్ పార్టీ దొంగల వలె కాంట్రాక్టర్లకు అప్పగించిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం స‌ద‌రు కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసి రీటెండర్లు నిర్వ‌హించింద‌ని అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి అప్పుడు మంత్రిగా పనిచేసి వందల కోట్లు దోచుకున్నాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై లో కొన్ని వందల కోట్ల కుంభకోణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడన్నారు. తనకు జైలు తప్పదని, కేసీఆర్‌ను తిడితే కుంభకోణం దాగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరికి పడడం లేదని, ఇలా తిట్టడం వల్ల మీకు పార్టీ ఏదో న్యాయం చేస్తుంద‌నుకుంటే మీ పొరపాటే అంటూ ఉత్త‌మ్‌ను ఉద్దేశించి అన్నారు.

కడియం రాజీనామా చెయ్.. తాటికొండ ఫైర్‌

కడియం శ్రీహరి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అవ‌గాహ‌న‌లేమితో మాట్లాడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య అన్నారు. కడియం శ్రీహరి ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌డ‌తాడ‌ని ఎద్దేవా చేశారు. కడియం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబుకు, కేసిఆర్ కు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరాడని అన్నారు. 2022లోనే అయిపోయేటువంటి ప్రాజెక్టును క‌డియం శ్రీహ‌రే అడ్డుకున్నాడ‌ని అన్నారు. దాని పనుల కోసం తను, పల్లా రాజేశ్వర్ రెడ్డి కెసిఆర్ ను కలవగా రూ.134 కోట్లు అదనంగా కేటాయించాడన్నారు. శ్రీహరి ఇప్పటివరకు రిజర్వాయర్ ను సందర్శించిన పాపాన పోలేదని, ఎన్ని పంపులు ఉన్నాయో తెలవదని అన్నారు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో 100 పడకల హాస్పిటల్ రూ.37. 50 కోట్ల అభివృద్ధి పనులను తీసుకొస్తే దాన్ని కూడా ఆపించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారుల కష్టంతో గెలిచిన నీవు ద‌మ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ త‌రుపున పోటీ చేసి గెల‌వాలంటూ స‌వాల్ విసిరారు.

ప్రజలను హింసించే పాలన : మాజీ ఎమ్మెల్యే నన్నపనేని

ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ‌రంగ‌ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ అన్నారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజలను హింసించే పాలనంటూ ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తూ రైతుల పై కక్ష చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, హసన్‌ప‌ర్తి మండల బీఆర్ ఎస్ అధ్య‌క్షుడు బండి రజనీకుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీమ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, శ్రవణ్ కుమార్, విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యులు పోలేపల్లి రామ్మూర్తి, పదో డివిజన్ అధ్యక్షుడు ఖలీల్, 29వ డివిజన్ అధ్యక్షుడు సదాంత్, రవీందర్ రావు, వీరస్వామి తోపాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News