అధైర్య పడొద్దు అండగా ఉంటా: ఎమ్మెల్యే నరేందర్
శనివారం కురిసిన వడగండ్ల అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు, ధ్వంసమైన ఇండ్ల బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.
దిశ, వరంగల్ టౌన్: శనివారం కురిసిన వడగండ్ల అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు, ధ్వంసమైన ఇండ్ల బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 37, 38వ డివిజన్ లో ధ్వంసమైన ఇండ్లను, పంట పొలాలను ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిస్తూ పలువురికి ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వడగండ్ల వర్షం ఎంతో నష్టం చేకూర్చిందని చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయని మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు ఇతర పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని తాను వాటన్నింటినీ దగ్గరుండి పరిశీలించానన్నారు.
తనకు సాధ్యమైనంత మేరకు ఆర్థిక సాయం అందించానని, రైతులు, ఇండ్లు ధ్వంసమైన వారు ఎవ్వరూ కూడా అధైర్య పడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పంట నష్టంతో పాటు ధ్వంసమైన ఇండ్లు ఏ మేర నష్టం జరిగిందో అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు . ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని, ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి గృహలక్ష్మీ పథకం ద్వారా 3 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు బైరబోయిన ఉమదామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, మాజీ కార్పొరేటర్ బిళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.