సబ్సిడీతో మోటార్ల పంపిణీ..
తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు మరింత లబ్ధి చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
దిశ, నర్సంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు మరింత లబ్ధి చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సబ్సిడీ కరెంట్ మోటార్ల పంపిణీని ఎమ్మెల్యే పెద్ది చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అప్లై చేసుకున్న రైతులకు 50 శాతం సబ్సిడీతో మోటార్లను అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలోనూ ఈ తరహా కార్యక్రమం లేదన్నారు.
గతంలో టెక్స్మో కంపెనీకి చెందిన మోటార్లను రైతులకు అందించామని, ప్రస్తుతం సీఆర్ఐ కంపెనీ మోటార్లను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఈ తరహా కార్యక్రమం లేదన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రైతుల సంక్షేమం కోసం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ రైతులందరికీ ఏదో ఒక రూపంలో లబ్ది చేకూర్చడమే తమ లక్ష్యం అన్నారు. సోమవారం తొలి విడతగా 300 కరెంట్ మోటార్లను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు అధిక సంఖ్యలో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, డివిజన్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.