కవర్ కూరగాయలు…వరంగల్ మార్కెట్‌లో కొత్త తరహా వ్యాపారం
వరంగల్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, అడ్తీదారులదే హవా కొనసాగుతోంది. బినామీలను పెట్టి రిటేల్ వ్యాపారం చేయడమే కాదు
దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, అడ్తీదారులదే హవా కొనసాగుతోంది. బినామీలను పెట్టి రిటేల్ వ్యాపారం చేయడమే కాదు, ప్రజలు మార్కెట్‌కు వచ్చే సమయాల్లో వాహనాలను మార్కెట్ ప్రాంగణంలో నిలపడం, మార్కెట్ నియమాలను తుంగలో తొక్కడం వ్యాపారులదే చెల్లుబాటవుతోంది. మార్కెట్‌లో షాపులున్నా.. ఆరుబయట తడకలు కట్టి మరీ దందా కొనసాగించడంలో వ్యాపారుల రాజ్యమే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా, మార్కెట్‌లో కొత్త పంథాకు తెరతీశారు. గతంలో బస్తాలు, ప్లాస్టిక్ పెట్టెల్లో సరుకులు మార్కెట్‌కు వచ్చేవి. ఇప్పుడా పద్ధతికి స్వస్తి పలికారు. పర్యావరణానికి చేటు కలిగించే ప్లాస్టిక్ కవర్లలో పది కిలోల చొప్పున కూరగాయలు విక్రయించడం విస్మయానికి గురిచేస్తోంది. వరంగల్ నుంచే పర్యావరణ శాఖ మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతుండగా, వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో వ్యాపారం చేయడం విస్మయానికి గురి చేస్తోంది.
మార్కెట్ అధికారులు మౌనం!
మార్కెట్‌తో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అధికారుల తీరు హాస్యాస్పదమనిపిస్తోంది. కూరగాయల మార్కెట్‌లో ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్కెట్‌లో బినామీలు రాజ్యమేలుతున్నారని ఎలుగెత్తి చాటినా అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతులకు, ప్రజలకు సరైన వసతులు లేవని కథనాలు ప్రచురితమైనా స్పందించే వారు లేరు. మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారన్న వార్తలకూ చర్యలు తీసుకునే వారూ కరువయ్యారు. వ్యాపారులు అందించే మామూళ్లకు అలవాటు పడి మార్కెట్ వ్యవస్థను, మోడల్ మార్కెట్ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు.. తాజాగా కవర్ల వ్యాపారం కూడా కనపడి ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి.