'రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. తెలంగాణ ఇచ్చిన ఆమె రుణం తీర్చుకుందాం'

Update: 2023-09-30 12:51 GMT

దిశ‌, వరంగ‌ల్ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజ‌లు ఎదురు చూస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌, వ‌ర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న కేఆర్ నాగ‌రాజు అన్నారు. వ‌ర్ధన్నపేట గ‌డ్డపై చేతి గుర్తు జెండా ఎగురేద్దామ‌ని నాయ‌కుల‌కు, కార్యక‌ర్తల‌కు పిలుపునిచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల్సిన అవ‌స‌రముంద‌ని అన్నారు. టికెట్ విష‌యంలో అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు వెలువ‌డ‌టంతో శ‌నివారం అన్నారం ద‌ర్గాలో నాగ‌రాజు ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించారు.


వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఆధ్వర్యంలో వంద‌లాది మంది కాంగ్రెస్ కార్యక‌ర్తల‌తో బైక్ ర్యాలీగా అన్నారం ద‌ర్గాకు చేరుకున్నారు. ద‌ర్గాలో ప్రత్యేక ప్రార్థన‌లు చేసిన అనంత‌రం ప‌ర్వత‌గిరి మండ‌ల‌కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వ‌ద్దకు చేరుకున్నారు. అంబేద్కర్‌కు పూల‌మాల వేసిన అనంత‌రం మండ‌ల‌ కేంద్రంలోని ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్కీంల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించారు. ప్రచారం అనంత‌రం మండ‌ల‌ కేంద్రంలోనే ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడారు. ప్రజ‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఉద్ఘాటించారు. సోనియ‌మ్మ క‌ల‌లు క‌న్నా రాజ్యాన్ని తీసుకువ‌చ్చేందుకు కార్యక‌ర్తలంతా క‌లిసి ప‌నిచేయాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ముఖ్య నేత‌లు, మాజీ జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచులు పాల్గొన్నారు.

నాగ‌రాజుకు టికెట్ క‌న్ఫార్మ్‌..!

వ‌ర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థిత్వం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగ‌రాజుకు ఖరారైన‌ట్లుగా అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఈ మేర‌కు పార్టీ అధిష్ఠానం ముఖ్య నేత‌ల నుంచి ఆయ‌న‌కు స్పష్టమైన సంకేతాలు రావ‌డంతో ప్రచారాన్ని ఆరంభించిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ ప్రక‌టించ‌బోయే తొలిజాబితాలోనే నాగ‌రాజు పేరు ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏకంగా 18మంది అభ్యర్థులు టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా ప్రధానంగా సిరిసిల్ల రాజ‌య్య, న‌మిండ్ల శ్రీనివాస్‌, ప‌రంజ్యోతిల మ‌ధ్య పోటీ న‌డిచింది.


అయితే పార్టీ అధిష్ఠానం చేయించిన స‌ర్వేల్లో కేఆర్ నాగ‌రాజుకు అనుకూలంగా రావ‌డంతో అధిష్ఠానం ఆయ‌న అభ్య‌ర్థిత్వం వైపు మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ ఫ్లాష్ స‌ర్వేలోనూ నాగ‌రాజుకు అనుకూలంగా రావ‌డంతో ఆయ‌న పేరు దాదాపుగా ఖ‌రారైన‌ట్లేన‌ని ఆ పార్టీ ముఖ్యుల ద్వారా తెలుస్తోంది.


Similar News