Enumamu market : ఆరని పత్తి రైతుల ఆవేదన !
ఏనుమాముల మార్కెట్ ( Enumamu market ) ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దది. ఇతర మార్కెట్లకు అన్నింటా ఆదర్శంగా నిలవాల్సిన మార్కెట్.
దిశ, వరంగల్ టౌన్ : ఏనుమాముల మార్కెట్ ( Enumamu market ) ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దది. ఇతర మార్కెట్లకు అన్నింటా ఆదర్శంగా నిలవాల్సిన మార్కెట్. కానీ, నిత్యం రైతుల ఆందోళనలు, ఆవేదనల మధ్య కొనసాగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది మార్కెట్‌లో పత్తి సీజన్ ( Cotton season ) ఈ నెల 3న ప్రారంభమైంది. నాలుగు రోజుల నుంచి పత్తి విరివిగా వస్తోంది. అయితే, ధరలు తగ్గుముఖం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నెల 25 న ధర తక్కువగా ఉందంటూ నిరసనకు దిగారు. జెండా పాట క్వింటా రూ.6900 నిర్ణయించిన వ్యాపారులు రైతుల ఆందోళనతో రూ.100 పెంచి రూ.7వేల చొప్పున కొనుగోలు చేశారు. తాజాగా, సోమవారం రైతులు మరోమారు నిరసనకు దిగారు. శుక్రవారం పలికిన ధరకంటే రూ.200 తగ్గి రూ.6800 జెండాపాట నిర్ణయించడం పై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రేటు గిట్టుబాటు కాదంటూ కాసేపు నిరసన వ్యక్తం చేశారు.
బేళ్లు, గింజల రేట్ల ప్రభావమట !
పత్తి ధరలు తగ్గడానికి బేళ్లు, గింజల ధరలు పడిపోవడమే కారణమని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. బేళ్లు రూ.3750 నుంచి రూ.3300, గింజలు రూ.5500 నుంచి రూ.5300లకు పడిపోయినట్లు వ్యాపారులు ( Traders ) చెబుతున్నారు. దీంతో ఆ ప్రభావం పత్తి ధర పై పడుతున్నదని పేర్కొంటున్నారు. దాని ఫలితంగానే పత్తి ధర తగ్గించాల్సి వచ్చిందని సోమవారం ఆందోళనకు దిగిన రైతులను బుజ్జగించే ప్రయత్నం చేసి చివరకు వాళ్లు నిర్ణయించిన రూ.6800కే కొనుగోళ్లు చేపట్టారు. చేసేదేమీ లేక రైతులు అదే ధరకు అసంతృప్తితో విక్రయించారు.
ఆదిలాబాద్ కంటే తీసికట్టు !
పెద్దదిగా చెప్పుకుంటున్న ఏనుమాముల మార్కెట్లో పత్తి ధర ఆదిలాబాద్ మార్కెట్ కంటే తక్కువగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. సోమవారం ఆదిలాబాద్ మార్కెట్లో క్వింటా పత్తి రూ.7120 పలికినట్లు తెలుస్తోంది. అంటే ఆ మార్కెట్ కంటే ఏనుమాముల మార్కెట్ ధర రూ.300 పైనే తగ్గడం సందేహాలకు దారి తీస్తోంది. బేళ్ల ధరలు తగ్గాయని చెబుతున్న వ్యాపారులు అక్కడి వ్యాపారులకు ఈ ధరలు వర్తించవా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడి నుంచి రైతులు ఆదిలాబాద్‌కు వెళ్లలేరనే ధైర్యమో, లేక తెచ్చిన సరుకును తిరిగి తీసుకెళ్లలేరనే ధీమానో వరంగల్ వ్యాపారులు ధరల నిర్ణయంలో రైతులను దగా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
లూజు పత్తినే తీసుకురావాలి !
మార్కెట్‌కు లూజ్ పత్తినే తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. బస్తాల్లో తీసుకురావడంతో తేమ శాతం అధికంగా ఉండి, సరైన ధర పొందే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. మంచిగ ఎండబెట్టిన పత్తిని లూజ్‌గా తీసుకొచ్చి సీసీఐ నిర్ణయించిన ధరను పొందాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించడానికి 12వేల కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఏనుమాముల మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. కాగా, సోమవారం మార్కెట్‌కు సుమారు 15వేల బస్తాల పత్తి వచ్చినట్లు తెలిసింది.