'బీఆర్‌ఎస్ నేతలను నక్సలైట్స్ టార్గెట్ చేశారు'.. బీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణలు

Update: 2023-09-30 12:11 GMT

దిశ, కాటారం : మంథని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే నక్సలైట్లతో ములాఖత్ అయి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ నా కుటుంబంతో పాటు నా ఈ ప్రాంత నాయకులను హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో భాగంగా మహాదేవపూర్ మండలంలో అంబటిపల్లి, సూరారం, రాపెళ్లికోట, కృష్ణరావుపేట, మహాదేవపూర్, ఎడపల్లి, కుదురుపల్లి గ్రామాలలో పాదయాత్ర జరగగా కూడళ్ళలో ప్రసంగించారు.

అభివృద్ధిపై దృష్టి సాధించకుండా సోషల్ మీడియాలో మా కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని నియోజకవర్గం లో పుట్ట మధు అనే వ్యక్తి లేకుంటే ఆడిందే ఆటగా చలామణి కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని పుట్ట మధు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాంత సమస్యలను ఏమాత్రం పట్టించుకో లేదని యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పుట్ట మధు అన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎమ్మెల్యే పోరాటం చేశాడా..? సమస్య చెప్పుకుంటే మా ప్రభుత్వం లేదని తేలికగా చెప్తున్నాడని, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్సోళ్లు వచ్చి మొసలి కన్నీరు కారిస్తే కరిగిపోయి ఓట్లు వేస్తామని, వాళ్లు ఏం చెప్పినా నమ్ముతామనే నమ్మకం వారిలో ఉంది కనుకనే పదేపదే వచ్చి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని.. ఎవరు మన కోసం పని చేస్తారో ఎవరు ఓట్ల కోసమే మభ్యపెడుతారో గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, కలికోట దేవేందర్, మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News