ఏనుమాములలో మరో మాయాజాలం..బ్లాక్‌దందాకు తెగబడిన వ్యాపారులు

ఏనుమాముల మార్కెట్‌లో అధికారులు కాకపోతే వ్యాపారులు

Update: 2024-09-25 14:51 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : ఏనుమాముల మార్కెట్‌లో అధికారులు కాకపోతే వ్యాపారులు ఒకరిని మించి మరొకరు అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన దందాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బుధవారం అధికారులు, కొందరు వ్యాపారులు కలిసి బ్లాక్‌ దందాకు పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. వీరాంజనేయ ట్రేడర్స్‌ ద్వారా (నంబర్‌ 5 ) రకానికి చెందిన 26 మిర్చి బస్తాలను క్వింటాకు రూ.14,500ల చొప్పున సాయి మహేశ్వర ఎంటర్ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోళ్లు మార్కెట్‌ నిబంధనల ప్రకారం కాకుండా కాంటా చీటీ లేకుండా చేయడం గమనార్హం.

మార్కెట్‌ నియమించిన దడువాయిలు డబ్బులకు కక్కుర్తిపడి జీరోదందాకు తెరలేపుతున్నారు. దీంతో మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా మార్కెట్‌ పరిధిలో ఉన్న 25 కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో ఖరీదుదారుల కోరిక మేరకు జీరోదందాకు దడువాయిలు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో ఇటు రైతులు, అటు వ్యాపారులు మిర్చీ ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ పరిధిలో గల 25 కోల్డ్ స్టోరేజీల్లో అప్పటికే సుమారు 27 లక్షల మిర్చి బస్తాలు నిల్వ చేసిన విషయం తెలిసిందే. వాటిని ఖరీదు దారులు తమ తమ అవసరాలను బట్టి జీరో చేస్తున్నారు. వీటిపై పర్యవేక్షించాల్సిన అధికారగణం నిద్రమత్తులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.


Similar News