మరిచిండ్రా.. మాయజేసిండ్రా : వరంగల్‌ బల్దియాలో మరో యవ్వారం?

Update: 2023-06-08 03:05 GMT

గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాను మరో అవినీతి ‘పొగ’ చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు విభాగాలు అక్రమాలకు నెలవుగా మారాయనే ఆరోపణలు పెద్దఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతజరుగుతున్నా రోజుకో అక్రమం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే సుమారు రూ.కోటి ప్రజాధనానికి జవాబుదారీతనం లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియా పరిధిలో దోమల నివారణ కోసం చేపట్టిన ఫాగింగ్‌ మిషన్ల కొనుగోలు వ్యవహారం రెండేళ్లయినా అంతుచిక్కని రహస్యంగా మారిందనే చర్చ జరుగుతోంది. పాలకవర్గం రెండేళ్ల కింద ప్రణాళికలు సిద్ధం చేసి 8 ఆటో యంత్రాలు, 8 ఫాగింగ్‌ మిషన్లు పెద్దవి కొనుగోలుకు రూ.68లక్షలు గుండుగుత్తగా ఓ మధ్యదళారీ ఏజెన్సీకి చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు చెల్లించి యేడాది దాటుతున్నా ఇప్పటివరకు ఒక్కటి కూడా బల్దియాకు చేరుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇక రూ.36లక్షలతో 66చేతిపంపు యంత్రాలు కొనుగోలు చేసినా వీటిలో 36 యంత్రాలు మూడు నెలలకే మూలకు పడ్డట్లు తెలుస్తోంది. రూ.లక్షలు చెల్లించి నాసిరకం యంత్రాలు కొనుగోలు చేశారనే చర్చ జరుగుతోంది. వానాకాలంలో ఫాగింగ్‌ యంత్రాలు కీలకంగా మారనున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

దిశ, వరంగల్‌ టౌన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాను మరో అవినీతి ‘పొగ’ చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు విభాగాలు అక్రమాలకు నెలవుగా మారాయని నగరవాసుల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా సుమారు రూ.కోటి ప్రజాధనానికి జవాబుదారీతనం లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాగింగ్‌ మిషన్ల కొనుగోలు వ్యవహారం రెండేళ్లయినా అంతుచిక్కని రహస్యంగా మారిందనే చర్చ జరుగుతోంది.

గుండుగుత్తగా చెల్లింపులు..

నగరంలో దోమల నివారణ కోసం పొగ వెదజల్లే యంత్రాల కొనుగోలుకు పాలకవర్గం రెండేళ్ల కింద ప్రణాళికలు సిద్ధం చేసింది. 8 ఆటో యంత్రాలు, 8 పాగింగ్‌ మిషన్లు పెద్దవి, 66 చేతిపంపు యంత్రాలు తెప్పించాలని నిర్ణయించింది. 8 ఆటో యంత్రాలకు, 8 ఫాగింగ్‌ మిషన్లకు రూ.68లక్షలు గుండుగుత్తగా ఒకేసారి ముందస్తుగా ఓ మధ్యదళారీ ఏజెన్సీ సంస్థకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం డబ్బు చెల్లించి యేడాది దాటుతున్నా ఆ 16 యంత్రాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా బల్దియాకు చేరుకోనట్లు విశ్వసనీయ సమాచారం. ఇక రూ.36లక్షలతో 66 చేతిపంపు యంత్రాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటిలో 36వరకు యంత్రాలు మూడు నెలలు పని చేశాయో లేదో అప్పుడే మూలకు పడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రిపేరుకు చేరుకున్న యంత్రాలు నాసిరకానికి చెందినవనే చర్చ జరుగుతోంది.

పట్టించుకోని పాలకులు, అధికారులు..

సాధారణంగా రూ.500, రూ.600 పెట్టి కొనుగోలు చేసే వాటర్‌ హీటర్లకే ఆయా కంపెనీలు వారంటీ ఇస్తున్నాయి. మరి రూ.36లక్షలు పోసి కొనుగోలు చేసిన యంత్రాలకు వారెంటీ ఉందో..? లేదో..? కూడా తెలియని పరిస్థితి నెలకొందని బల్దియాలో బాహాటంగానే చర్చ జరుగుతోంది. కొన్న 66 చేతిపంపు యంత్రాల్లో ఏకంగా 30మిషన్లు మూలన పడడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలోనే ఏదో గోల్‌మాల్‌ జరిగి ఉంటుందని సందేహం వ్యక్తం అవుతోంది. పెద్దమొత్తంలో కమీషన్ల రూపంలో బడా ప్రజాప్రతినిధులు, కొందరు అధికారుల చేతులు మారి ఉంటుందని చర్చించుకుంటున్నారు. అదీగాక, ముందస్తుగానే మొత్తం డబ్బు చెల్లించి రెండేళ్లు దాటినా ఇంకా ఆటోలు, ఫాగింగ్‌ యంత్రాలు రాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఇంకా తయారు చేస్తోందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌, ఉన్నతాధికారులకు ఇది తెలియకుండానే జరుగుతుందా? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఈ అవినీతి వెనుక అసలు అక్రమాలు బయటపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారంపై పాలకులు, అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే. వానాకాలంలో ఫాగింగ్‌ యంత్రాలు కీలకంగా మారనున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరీ..!

Tags:    

Similar News