అధికారుల ఉత్తర్వులు బేఖాతరేనా.!?

నర్సంపేట నగర పంచాయతీలో ఓ ఉద్యోగి కొన్నేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు.

Update: 2023-03-11 11:47 GMT

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణం పంచాయతీగా ఉన్న మొదలు నేడు నగర పంచాయతీగా మారినా 'అతనొక్కడే' ఎలాంటీ బదిలీలు లేకుండా దాదాపు మూడు దశాబ్దాలుగా ఏక ఛత్రాదిపత్యం సాగిస్తున్న ఘటన పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బదిలీ అన్న పదమే తెలియని ఆ ఉద్యోగి ఏండ్లుగా సాగించిన, సాగిస్తున్న వ్యవహారంపై ఏ ఒక్క ఉన్నతాధికారి సైతం నోరు మెదపలేదు. ఇన్నేండ్లకు పదుల సంఖ్యలో అతనిపై వస్తున్న ఆరోపణలకు ఉన్నతాధికారులు అతన్ని ట్రాన్స్ఫర్ కాకుండా డిప్యూటేషన్ చేసే సాహసం చేశారు. అది కూడా ఇప్పుడు కష్టతరంగా మారింది. రోజులు గడుస్తున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నపట్టునే ఎప్పటిలానే ఉండే అవకాశాలే ఎక్కువ అయ్యాయన్న ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు డిప్యూటేషన్ పై ఇప్పటికే అతన్ని రిలీవ్ చేసి సంబంధిత కార్యాలయానికి పంపాల్సి ఉన్నా నేటికీ అది అమలుకు నోచుకోలేదు.

ఇదీ సంగతి..!

నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో సంపత్ అనే వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో ఎటువంటి బదిలీలు లేకుండా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సంపత్ ని డిప్యూటేషన్ పై మహబూబాబాద్ జిల్లాలోని మర్రిపెడ మున్సిపల్ కార్యాలయానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా సదరు ఉద్యోగి మర్రిపెడ మున్సిపాలిటీలో రిపోర్ట్ చేయలేదు సరికదా నర్సంపేట మున్సిపాలిటీ నుండి ఇప్పటికీ రిలీవ్ కాలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పదుల సంఖ్యలో ఆరోపణలున్నా..?

నర్సంపేటలో ఎన్.ఎం.ఆర్ (నామినల్ మాస్టర్ రోలర్) వర్క్ ఇన్స్పెక్టర్ గా సంపత్ 1993 నవంబర్ లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అనంతరం 1988 నుండి ఉద్యోగం చేస్తున్నట్లు రికార్డులను మార్చి అప్పటి జీఓ ల ప్రకారం సర్దుబాటు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేయాల్సిన అధికారులు ఎటూ తేల్చలేదని మున్సిపాలిటీ సిబ్బంది సైతం అప్పట్లోనే బాహాటంగా విమర్శలు కురిపించారు. వడ్డించే వాడు మనవాడైతే ఏ ములకు కూర్చున్న ఎం కాదు అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయని వాపోయారు. ఇది చాల దన్నట్లు స్థానిక పరిస్థితులను అవపోసన పట్టిన సదరు ఉద్యోగి ఏండ్లుగా నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహారించాడు.

ఓ టైంలో అతను ఒక్కడు లేకపోతే కార్యాలయంలో పని ఆగినట్టేనన్న పరిస్థితిని కల్పించాడు. ఈ క్రమంలో కమిషనర్లు మారినా, సిబ్బంది మారినా, చైర్మన్ లు మారినా అతని పోస్ట్ కి , చేసే పనులకు ఎలాంటీ అభ్యంతరం కలగలేదు. ఇదే తడవుగా మున్సిపాలిటీ సిబ్బందిపై పెత్తనాన్ని వెలగబెడుతూ సంపత్ వారిని ఇబ్బందులకు గురి చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. తోటి ఉద్యోగులనూ ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు..వారు మున్సిపాలిటీ కార్యాలయంలోనే అతనితో గొడవకు దిగిన సందర్భాలు లేకపోలేదు.

డిప్యూటేషన్ పై వెళ్లేనా..!

నర్సంపేట మున్సిపాలిటీలో కింది స్థాయి ఉద్యోగి మొదలు.. ఉన్నతాధికారుల వరకు అందరూ ఆయనకు సుపరిచితులే. ఏండ్లుగా ఒకే చోట ఉండటంతో అందరు అధికారులు, ప్రజాప్రతినిధులతో గట్టి సంబంధాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్యోగం పరంగా, బదిలీల పరంగా ఎప్పుడూ ఏ సమస్యా అతనికి రాలేదన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ అనేది సాధారణం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు కావాల్సి ఉంటుంది. కానీ మూడు దశాబ్దాలుగా ఒకే స్థానంలో కొనసాగడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అందరు ఉద్యోగులకు వర్తిస్తున్న నిబంధనలు సదరు ఉద్యోగికి ఎందుకు వర్తించట్లేవన్నది ఏండ్లుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని, సదరు ఉద్యోగిని రిలీవ్ చేయాలని నర్సంపేట పట్టణ ప్రజానీకం కోరుతున్నారు.

Tags:    

Similar News