మరో బలవన్మరణం.. ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన జీవో 317

Update: 2022-01-25 12:22 GMT

దిశ, నర్సంపేట: జీవో 317 మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థానికతను కోల్పోతున్నాననే ఆవేదనతో ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన ఉప్పల రమేష్ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బాలుతండాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. జీవో 317లో భాగంగా ఇటీవల జరిగిన బదిలీల్లో ములుగు జిల్లా మల్లంపల్లికి బదిలీ అయ్యాడు. ఇదే విషయమై నెల రోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఎల్పీసీ సర్టిఫికెట్ నిమిత్తం సోమవారం ఖానాపూర్ హైస్కూల్‌కు వెళ్లాడు. తిరిగి నర్సంపేటకు బయలుదేరి మార్గంమధ్యలో పురుగుల మందు తాగి ఓ వెంచర్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి నర్సంపేటలోని రాజేంద్రప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి రమేష్ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతునికి భార్యా, కొడుకు, కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడు రమేష్ మృతి పట్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News