దళిత బంధు రాకపాయే.. ఉన్న గొర్రెలు పోయే.. తాజా మాజీ సర్పంచ్ బడా మోసం

దళితుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని

Update: 2024-09-24 12:24 GMT

దిశ,కేసముద్రం: దళితుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది.దళిత బంధు పేరు చెప్పి.. దళారులు మాత్రం పోగు చేసుకున్న సొమ్ముకు లెక్కేలేదు. బడా నేతలు తెలుసని చెప్పి.. పెద్ద మొత్తంలో ఆయా నేతలు అమాయకుల వద్ద నగదును దొరికిన కాడికి దోచుకున్నారు. లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు వస్తాయని ఆశ చూపి.. ఉపాధి పొందుతున్న వనరులను సైతం అమ్ముకొని లంచాలు ఇస్తే.. ఆకరికి దళిత బంధు వచ్చుడు దేవుడెరుగు.. ఉన్న ఉపాధి కూడా పోయి.. రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండా గ్రామపంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసింది...

కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దళిత బంధుకు ఆశపడ్డాడు. తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో...నీకు దళిత బంధు వస్తుందని అప్పటి సర్పంచ్ దళిత బంధు ఇప్పిస్తామని ఓ అమాయక దళితుడిని నమ్మించాడు. రెండు లక్షల రూపాయలు ముందుగా ఖర్చు చేయాలని, లేదంటే వేరే వాళ్ళు పైసలతో సిద్ధంగా ఉన్నారని సర్పంచ్ గట్టిగానే వారించాడు. దీంతో ఆ పేద బిడ్డ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నాదని చెప్పుకొచ్చాడు. పైసలు పెట్టకపోతే లభ్థిపోందనేమోనన్న భయంతో తన ఉపాధికి ఆసరాగా నిలిచిన గొర్రెలను అమ్మి ఆ మాజీ సర్పంచ్ కి అడిగిన నగదును అప్పజెప్పాడు. ఇలా రెండు దఫాలుగా మొత్తం రూ. 70వేల వరకు అప్పజెప్పినట్లు బాధితుడు చెబుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. నగదు కాజేసిన మాజీ సర్పంచ్.. గొర్రెల కాపరికి దళిత బంధు ఇప్పించడంలో విఫలమయ్యాడు. దళిత బంధు ఇవ్వకపోగా.. ఆ అమాయక దళితుడి‌ని నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ ఇతరత్రా మాటలతో దూషించిన పరిస్థితి. దీంతో.. బాధితుడు.. అటు గొర్రెలు పోయి.. ఉపాధి లేక.. ఇటు దళిత బంధు రాక.. నట్టేట మునిగిన పరిస్థితి.

బోరున విలపిస్తున్న బాధితుడు...

మాజీ సర్పంచ్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం కావాలని ఆ బాధితుడు కోరుతున్నాడు. నమ్మించి మోసం చేశారని ఇలా ఎంతో మంది అమాయకులను మాజీ సర్పంచ్ దగా చేశాడని అంటున్నాడు. గత పాలనపై సమగ్ర విచారణ చేస్తే.. ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని, బాధితులందరూ రోడ్డుపైకి వస్తారని చెప్తున్నారు. జీవన ఉపాధిగా ఉన్న గొర్రెలు సైతం పోయి, ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నానని అంటున్నాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ తీసిన మాజీ తాజా సర్పంచ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

కేసముద్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో..

మండలంలో ఈ ఘటనే కాక.. అనేక మంది దళిత బంధు బాధితులు ఇలాంటి దళారుల చేతిలో మోసపోయారని తెలుస్తోంది. అనేకమంది పేదబిడ్డల వద్ద.. ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని చెప్పి నగదు పోగు చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. బాధితులంతా.. రోడ్డుపైకి వస్తే తప్ప.. దళారుల వ్యవహరం బయటపడదు. ఇదంతా అధికారుల కనుసన్నులోనే జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి బాధితులకు అధికారులు ఏమేరకు న్యాయం చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి బాధిత గొర్రెల కాపరికి న్యాయం జరుగుతుందా లేదా వేచి చూడాలి.


Similar News