తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా ప్రజలకు ఆ వాస్తవాలు చెప్పాలని ప్లాన్..!

మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మీటింగ్‌లు, ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియాల్లో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి.

Update: 2024-10-19 01:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మీటింగ్‌లు, ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియాల్లో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. మూసీ‌పై గులాబీ పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ చెబుతున్నది. బీఆర్ఎస్ చేసే అసత్య ప్రచారాలను సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ.. వాటికి అడ్డుకట్ట వేయాలని ప్లాన్ చేస్తున్నది. మూసీ ప్రక్షాళనపై ప్రజలకు స్పష్టంగా వివరించాలని నిర్ణయించింది. మూసీపై బీఆర్‌ఎస్ చేస్తున్న వాదన తప్పంటూ ఇక నుంచి ప్రతిరోజూ మంత్రులు కౌంటర్లు ఇవ్వనున్నారు. ప్రెస్‌మీట్లు, పబ్లిక్ మీటింగ్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా మంత్రులు సీరియస్‌గా మాట్లాడనున్నారు. మూసీ ప్రక్షాళనతో లాభం ఏమిటి? ఏం జరుగుతుంది? బాధితులకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? వంటి అంశాలపై మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించనున్నారు. మంత్రులతోపాటు ప్రభుత్వ విప్‌లు, స్పోక్స్ పర్సన్లు సైతం మూసీ ప్రక్షాళనపై అవగాహన కల్పించనునున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే పీసీసీ ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసింది. మినిస్టర్లకు సైతం ఈ మేరకు సమాచారం అందించింది.

మేథావులతోనూ చర్చలు

మూసీ అనుబంధ జిల్లాల మేధావులు, ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్, ఎన్‌జీవోలతోనూ ప్రభుత్వం చర్చలు జరపనున్నది. మూసీ ప్రక్షాళనను ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరనున్నది. వారితో ప్రత్యేకంగా డిబేట్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఫైట్‌ వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. మూసీ ద్వారా తమకేదో నష్టం జరుగుతుందనే అపోహలతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రక్షాళనపై ప్రజలకు సుస్పష్టంగా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.

సిటీలో బోర్డులు? గత ప్రభుత్వ తప్పిదాలు జనాల ముందుకు?

మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వ యాక్షన్ ప్లాన్‌ను జనాలకు తెలియాలని ఆ నది పరివాహక ప్రాంతాలు, కొన్ని కీలక కూడళ్లలో ప్రభుత్వం కొన్ని బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం మూసీ నది వల్ల జరుగుతున్న నష్టాలను ప్రజలకు అర్థమయ్యే తరహాలో వివరించనున్నారు. ఇక మూసీ బాధితుల కోసం ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వంటి అంశాలను తెలియజేయనున్నారు. మూసీని కాపాడుకోకపోతే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలనూ వివరించనున్నారు. వరదలు కారణంగా బెంగళూరు, చెన్నయ్, ప్రకృతి వైపరీత్యంతో విలవిల్లాడిన వయనాడ్ వంటి నగరాల పరిస్థితులను బోర్డుల రూపంలో ప్రదర్శించనున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్టు వివరించనున్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ చెబుతూనే, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పరిస్థితి, ఇతర ప్రాజెక్టులలో బీఆర్ఎస్ ప్రజలను మోసగించిన తీరును ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. లేదంటే గులాబీ పార్టీ అసత్య ప్రచారాలతో తమ పార్టీకి డ్యామేజీ జరిగే ప్రమాదం ఉన్నదని పీసీసీ భావిస్తున్నది.


Similar News