సీఎం నిర్ణయం కోసం వెయిటింగ్.. ‘యూఎల్సీ’ రెగ్యులరైజేషన్ చేస్తే రూ.1000 కోట్లు!

రాష్ట్రంలో జీవో 58, 89 ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం.. యూఎల్సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) స్థలాల రెగ్యులరైజేషన్ ను మాత్రం పట్టించుకోలేదు.

Update: 2024-07-16 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జీవో 58, 89 ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం.. యూఎల్సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) స్థలాల రెగ్యులరైజేషన్ ను మాత్రం పట్టించుకోలేదు. దీని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోయినా.. వేలాది కుటుంబాలు మాత్రం ఇబ్బందులు పడ్డాయి. లీగల్ గా ఇండ్లు కట్టుకునే వీల్లేకుండాపోయింది. బ్యాంకు రుణాలు దొరకడమూ గగనంగా మారింది. దీంతో గత పెండింగ్ ఫైల్ ను క్లియర్ చేస్తే.. తమ ఇబ్బందులు తొలగిపోతాయని వేలాది కుటుంబాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే యూఎల్సీ అప్లికేషన్లను పరిశీలించి.. వాటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశముందని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు.

ఆబ్జెక్షన్స్ లేకున్నా పెండింగులో..

ఒక్కొక్కరు రూ.లక్షలు పోసి స్థలాలు కొన్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఎక్కడా ఆ స్థలాలపై ఆబ్జెక్షన్స్ తలెత్తలేదు. సబ్ రిజిస్ట్రార్లు ప్లాట్లను సాధారణంగానే సేల్ డీడ్స్ చేశారు. కొంత కాలానికి ఆ స్థలాలు సీలింగ్ ల్యాండ్స్ అని లెక్క తేల్చారు. అంటే ఎవరి నుంచైతే సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్స్ ని సేకరించారో.. వారే ఇతరులకు అమ్మేశారు. ఒక్కో స్థలం నలుగైదుగురి చేతులు మారింది. చాలా మందికి రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్ కాపీలు చేతిలో పెట్టారు. అయితే ఉన్నట్టుండి యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయడంతో సమస్య మొదటికి వచ్చింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలోని సుమారు పది వేలకు పైగా అప్లికేషన్లు పెండింగులో ఉన్నట్లు తెలిసింది.

సీలింగ్ ల్యాండ్స్ అంటే..

ఒక్కరికి యాభై ఎకరాలకు పైగా ల్యాండ్ ఉండొద్దంటూ 1976లో యూఎల్సీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అధిక భూములు కలిగిన వారి నుంచి భూములను సేకరించి పేదలకు కూడా పంచడం మొదలుపెట్టారు. దీంతో కొందరు సీలింగ్ నుంచి తప్పించుకునేందుకు వారసులు, స్నేహితుల పేరిట భూములు రాశారు. అప్పటికే కొంత అమ్మేసినట్లు రికార్డులు సృష్టించారు. అలాంటి భూములను అప్పట్లో త్వరితగతిన సేల్ డీడ్స్ చేసేశారు. ప్లాట్లు చేసి అమ్మేసినవి అత్యధికం ఉన్నాయి. ఆ స్థలాలకు జీవో 456 ద్వారా డిక్లరెంట్స్, లీగల్ రిప్రజెంటేటివ్స్ కు హక్కులు కల్పించారు. పొషెషన్ లో ఉన్నోళ్లందరికీ ఇది వర్తింపజేశారు. జీవో 455, 456ల ద్వారా థర్డ్ పార్టీలకు హక్కులు కల్పించారు. ఈ రెండు జీవోల ద్వారా 2008 వరకు అనేక స్థలాలను రెగ్యులరైజ్ చేశారు. 2008 మార్చి మూడో తేదీన యూఎల్సీ యాక్ట్ -1976 రిపీల్ అయ్యింది. అయితే అప్పటికే డిక్లరెంట్లు, థర్డ్ పార్టీలు రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ పెండింగులో పడేశారు.

పెడింగులో వేలాది దరఖాస్తులు

యూఎల్సీ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్, పెండింగ్ అప్లికేషన్లపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నది. ఎవరైతే పొషెషన్ లో ఉండి సేల్ డీడ్స్ లేకపోయినా కరెంటు బిల్లు, మున్సిపల్ బిల్లు వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు కలిగిన వారికి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2008 జూన్ 18న జీవో 747ని జారీ చేశారు. అలాగే 2014 డిసెంబరు 31న జీవో 60 ద్వారా యూఎల్సీ ల్యాండ్స్ ని జీవో 58, 59 నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరించారు. కానీ వేలాది దరఖాస్తులను పెండింగులోనే ఉంచారు.

ఫైల్ రిజెక్ట్ చేసిన అప్పటి సీఎం కేసీఆర్

థర్డ్ పార్టీ చేతుల్లో ఉన్న యూఎల్సీ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఫైల్ నం.3455/యూఎల్సీ(1)/2017ను అధికారులు అప్పటి సీఎం కేసీఆర్ కి పంపారు. అప్లికేషన్లను పరిశీలించి రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అయితే ఆయన నాలుగైదుసార్లు ఆ ఫైల్ ను రిటర్న్ చేసినట్లు తెలిసింది. అప్పట్లో సీఎంవోలో అత్యంత కీలక అధికారిగా ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లినా పని కానట్టు సమాచారం. అయితే వేలాది కుటుంబాలు స్టాంప్ డ్యూటీ చెల్లించి కొనుక్కున్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే ఆ కుటుంబాలకు ఇంటి అనుమతులు, బ్యాంకుల్లో రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఎలాగూ ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క సంతకం చేస్తే చాలు.. రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశముంది.

ఇలాంటివి అనేకం..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం ఆదిభట్లలో సర్వే నం.44లో 13.26 ఎకరాలు, 45లో 19.18 ఎకరాలు, 108లో 2.36 ఎకరాలు, 245లో 1.23 ఎకరాలు, 246లో 1.33 ఎకరాలు, 248లో 1.19 ఎకరాలు, 249లో 1.06 ఎకరాలు, 250లో 0.30 ఎకరాలు సీలింగ్ సర్ ప్లస్ గా నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ లో సర్వే నం.6లో 13.03 ఎకరాలు, 249లో 3.22 ఎకరాలు, 252లో 3.30 ఎకరాలు, 254లో 9.20 ఎకరాలు, 265లో 4.06 ఎకరాలు, 276లో 10.15 ఎకరాలు, 500లో 10.25 ఎకరాలు, 501లో 12.16 ఎకరాలు, 504లో 11.28 ఎకరాలు, 505లో 9.28 ఎకరాలు, 506లో 8.08 ఎకరాలు, 508లో 11.15 ఎకరాలు, 509 నుంచి 662 వరకు సుమారు 200 ఎకరాలను కూడా సీలింగ్ సర్ ప్లస్ గానే ఎంట్రీ చేశారు. వాటిలో చాలా వరకు హార్డ్ వేర్ పార్కుకు ఇచ్చేశారు.

ఇంకొంత మూడు దశాబ్దాల క్రితమే ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇప్పుడేమో ఆ ప్లాట్ల యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సీలింగ్ సర్ల ప్లస్ ల్యాండ్ అని, ఎవాక్యూ ప్రాపర్టీ అంటూ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో నమోదు చేశారు. అయితే పీవోబీలోని ప్లాట్లకు లంచాలు తీసుకుంటూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలోని స్థలాల రిజిస్ట్రేషన్లు మరింత కాస్ట్లీగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం సీలింగ్ సర్ ప్లస్ అని డిక్లేర్ చేసినప్పుడు 30 ఏండ్ల క్రితమే రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలి. కానీ అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూనే ఉన్నది. ఇప్పుడేమో ఇండ్లు కట్టుకునేందుకు వెళ్తే మీ ప్లాట్లకు అనుమతులు ఇవ్వమంటూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ రిజెక్ట్ చేస్తున్నది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.


Similar News