కేసీఆర్ పై కోపంతోనే రేవంత్ రెడ్డికి ఓట్లు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న రోజే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు.

Update: 2024-04-10 10:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న రోజే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. బీఆర్ఎస్ బర్కత్ లేకుండా పోయిందని, ఆ పార్టీకి ఓటు వేస్తే మురికి గుంటలో వేసినట్టే అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేశారనే తప్ప రేవంత్ రెడ్డిని చూసో, లేదా కాంగ్రెస్ పార్టీ హామీలను చూసో వేయలేదన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడ?

మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే వారి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుందనే వారు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీల గురించి చెప్పాలంటే సమయం సరిపోదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈనాడు మాట్లాడుతున్న మాటలు గమనించాలన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, క్రాప్ లోన్లు తెచ్చుకోవాలని చెప్పిన వారే ఇప్పుడు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా రైతుల కళ్లలో మట్టికొట్టారని మండిపడ్డారు. రూ.500 బోనస్ ఊసే లేదు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇప్పుడు 17 సీట్లు గెలిపించండి రాహుల్ ప్రధాని అయితే నిధులు తీసుకువస్తా అంటున్నారని మండిపడ్డారు. 17 సీట్లు వచ్చేది లేదు నేను ఇచ్చేది లేదు రేవంత్ రెడ్డి అని చెప్పకనే చెప్తున్నారని, సీఎం మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?:

కాంగ్రెస్ పార్టీ డబ్బును నమ్ముకున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా రాత్రి పూట ఇళ్లకు వెళ్లి రూ.లక్షలు ఆశ చూపి స్థానిక నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పోతుండవచ్చు కానీ ప్రజలంతా ఏకమవుతున్నారని మూడోసారి మోడీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరో జన్మ ఎత్తిన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాలేరని, ఇన్నాళ్లు అండగా ఉన్న యూపీలో గెలవలేక కేరళకు పారిపోయారని ఎద్దేవా చేశారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ లో కాంగ్రెస్ కు దిక్కులేదని, కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా 40 సీట్లు గెలుస్తాయన్నారు. వాటితో రాహుల్ గాంధీ ఎలా ప్రధాని అవుతారు? ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసేతు హిమాచలం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ప్రధాని మొదటి ఎన్నికల శంఖారావం ఇక్కడే మొదలుపెట్టారని గుర్తు చేశారు. మనం చూపించిన ప్రేమకు ఆయన ముగ్ధులయ్యారని, మల్కాజిగిరి మోడీకి లోకల్ గా మారిందన్నారు. ఇక్కడ బీజేపీని గెలిపించి ఆయనకు గిఫ్ట్ గా ఇద్దామన్నారు. ఇంకో జన్మ ఎత్తినా రాహుల్ ప్రధాన మంత్రి కాలేరన్నారు.

Tags:    

Similar News