ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓటెయ్యాలి..: Ponguleti Srinivasa Reddy
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.
దిశ, నేలకొండపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఖమ్మం మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలను చుట్టేస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆదివారం నేలకొండపల్లి మండల పరిధిలోని రాయిగుడెం,అప్పల నర్సింపురం, కట్టు కాచారం, కొంగర గ్రామాలలో పొంగులేటి పర్యటీంచారు. ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పథకాలను తెలియజేశారు. ఆయా గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయన్నారు.
రవాణా దూరాన్ని తగ్గించేందుకు పల్లె పల్లెకు లింక్ రోడ్డులను వేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. రెండుసార్లు తెలంగాణ ప్రజలకు మాయమాటలు వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తుఫాన్‌లా కాంగ్రెస్ విజృంభిస్తుందని ఆత్మ గౌరవం కోసమే కాంగ్రెస్‌లో అందరూ చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రోడ్లు గుంతలమయం కాగా, వాటిని మరమ్మత్తులు కూడా చేపట్టలేని, తట్టెడు మట్టి పోయలేని నిస్సహాయ స్థితిలో ఎమ్మెల్యే ఉండటం సిగ్గుచేటు అన్నారు.
అక్రమంగా సంపాదించిన లక్షలాది కోట్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ అంటూ ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి మీ శీనన్నను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంబూరి నరేష్, బోయిన వేణు, గోవిందరావు, చెరువు స్వర్ణ, వెన్నే పూసల సీతారాములు, బచ్చలకురి నాగరాజు, జేర్రిపోతుల అంజనీ, యడవల్లి నాగరాజు, శాఖమూరి రమేష్, జానకిరాములు, వీరయ్య, మహేష్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.