పాల బిల్లులు చెల్లిస్తాం : గుత్తా అమిత్‌రెడ్డి

రాష్ట్రంలోని విజయ డెయిరీ సహా ఇతర డెయిరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్‌ సొసైటీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి వెల్లడించారు.

Update: 2024-09-23 10:39 GMT

దిశ, వెబ్ డెస్క్ :  రాష్ట్రంలోని విజయ డెయిరీ సహా ఇతర డెయిరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్‌ సొసైటీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ.12.48 పైసలు పెంచామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాల సేకరణ రేటు పెంచడంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ.26 నుంచి రూ.34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, బిల్లుల చెల్లింపుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేస్తామన్నారు.  ఇక నుంచి విజయ డెయిరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే పెండింగ్‌ పాల బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్ రెడ్డి చెప్పారు. 


Similar News