VH: కేసీఆర్, కేటీఆర్.. సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ అని కేసీఆర్, కేటీఆర్‌లను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రశ్నించారు.

Update: 2024-09-10 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ అని కేసీఆర్, కేటీఆర్‌లను (KCR, KTR) కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు (V.Hanumantha Rao) ప్రశ్నించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కుల గణన (BC Caste Enumeration) తరువాతే స్థానికల ఎన్నికలు జరగాలని అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కుల గణన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, కోర్టు కూడా మూడు నెలల లోపు కుల గణన రిపోర్టు ఇవ్వాలని చెప్పిందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కూడా బీసీ కుల గణనకు పూర్తి మద్దతు తెలిపారని అన్నారు.

అయితే, గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో సకల జనుల సర్వే చేసిందని, కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును మాత్రం బయట పెట్టలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆ రిపోర్టులు ఎక్కడికి పోయాయంటూ ఆయన కేటీఆర్, కేసీఆర్‌లను ప్రశ్నించారు. ఇప్పటికైనా కంప్లీట్ డేటాను సీఎస్‌కు అందజేయాలని, ఆ రిపోర్టు ఇస్తే బీసీ కులగణనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సీఎ రేవంత్‌రెడ్డి రూ.150 కోట్లు విడుదల చేస్తే కేవలం రెండు నెలల్లోనే బీసీ కుల గణన (BC Caste Enumeration) రిపోర్టు వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుల గణన ప్రక్రియను ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్‌లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సకల జనుల సర్వే రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన పూర్తి అయ్యాక సర్పంచ్ ఎన్నికలు వస్తే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ అన్నారు.


Similar News