నత్తనడకన అర్బన్ ప్లానింగ్ సర్వే

హైదరాబాద్ నగరాన్ని మొత్తం స్కాన్ చేసేందుకు జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ చేపట్టింది.

Update: 2024-10-04 01:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరాన్ని మొత్తం స్కాన్ చేసేందుకు జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ చేపట్టింది. మూడంచెల ఈ సర్వేలో భాగంగా తొలుత శాటిలైట్ సర్వే, ఆ తర్వాత డ్రోన్లతో సర్వే నిర్వహించినానంతరం ఇంటింటికెళ్లి సమాచారం సేకరణ చేయాలని బల్దియా నిర్ణయించింది. తొలి దశగా ఈ సర్వేను జులై 30వ తేదీ నుంచి ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. రూ.22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వే మొత్తాన్ని 18 నెలల్లో సేకరించేలా జీహెచ్ఎంసీ డెడ్‌లైన్ విధించింది. సర్వే బాధ్యతలను నియోజియో సంస్థకు అప్పగించింది.

సర్వేతో..

జీహెచ్ఎంసీగా ప్రకటించకముందున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడేలా ఉందన్న వ్యత్యాసాన్ని అంఛనా వేసేందుకే ఈ సర్వేను చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారంతో నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక క్యూఆర్ కోడ్‌ను కేటాయించి, దాని ద్వారా జీహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగుగా అందించేలా సంస్కరణలను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ క్యూఆర్ కోడ్‌తో కేవలం పౌర సేవలేగాక, ఏదైనా విపత్తుగానీ, ప్రమాదం గానీ జరిగినప్పుడు వీలైనంత త్వరగా అక్కడకు డిజాస్టర్, పోలీసు బృందాలు చేరుకునే వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వే ద్వారా సేకరించే డేటాను హైడ్రాకు సైతం అందించనున్నారు.

ట్యాక్స్ కలెక్షన్ పై ఆశలు..

అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి జీఐఎస్ సర్వేపై గంపెడాశలు పెట్టుకుంది. ఈ సర్వే ద్వారా ఆస్తి పన్ను వసూలు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అనుమతులు ఉల్లంఘించి అదనంగా నిర్మించిన అంతస్తులకు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపజేయాలన్న ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది. ఇందుకు గాను సుమారు 19.49 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసి, సమాచారాన్ని సేకరించనున్నారు. సర్వేలో సేకరించే సమాచారాన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్‌ను వర్తింపజేస్తే సంవత్సరానికి రూ.3 వేల కోట్ల వరకు ట్యాక్స్ వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు.

రెండు నెలల్లో...

జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వేను 18 నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల ఆస్తి పన్నుకు సంబంధించి అసెస్‌మెంట్స్ ఉన్నాయి. వీటిని 18 నెలల్లో పూర్తి చేయాలంటే నెలకు 1.08 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ రెండు నెలల్లో 14 వేల ప్రాపర్టీలను మాత్రమే సర్వే చేశారు. డ్రోన్ సర్వే, ఫీల్డ్ సర్వే చేసిన అనంతరం డేటాను క్రోడికరించి దాని ఆధారంగా ఆస్తి పన్నును పెంచేవిధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ సర్వే నత్తనడకన సాగుతుందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీనికి ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు విమర్శిస్తున్నారు.


Similar News