Kishan Reddy: మీ మొఖాలకు మాకు సలహాలిస్తారా?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్
అమృత్ స్కీమ్ టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడం అవివేకం అని, సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లీస్తోందని విమర్శించారు. అమృత్ స్కీమ్ లో (Amrit Scheme Tenders) జరిగిన అవినీతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తామే కోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని దుయ్యబట్టారు. వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికెట్ అక్కర్లేదన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని మొఖాలు ఇవాళ మేమేం చేయాలో చెప్పనక్కర్లేదన్నారు. ప్రజలతో తప్ప ఏ పార్టీతో బీజేపీ ములాఖత్ అవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎవరికి మిత్రులో మీడియానే పరిశోధన చేసి చెప్పాలన్నారు.
మినరల్స్ టు మైల్ స్టోన్:
ఈ ఏడాది మైనింగ్ శాఖ 'మినరలస్ టు మైల్ స్టోన్' అనే లక్ష్యంతో పని చేయబోతున్నదని కిషన్ రెడ్డి చెప్పారు. బొగ్గు వెలికితీత కార్మికుల రక్షణే మా తొలి ప్రాధాన్యం అని, కార్మికుల సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. కోల్ ఇండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంవత్సరం పాటు కోల్ ఇండియా (Coal India) 50 ఏళ్ల ఉత్సవాలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. 2025 అక్టోబర్ వరకు కోల్ ఇండియా సెలబ్రెషన్స్ ఉంటాయన్నారు. బొగ్గు ఉత్పత్తిలో సాంకేతికను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని, పర్యావరణహితంగా మైన్ క్లోజర్ కార్యకలాపాలు చేస్తామన్నారు. 95 శాతం రాగిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, రాగి ఉత్పత్తిలో స్వావలంభన సాధించాలని ప్రధాని ఆదేశించారన్నారు. రానున్న రెండు, మూడు నెలల్లో ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌ల వేలాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని, మొదటి దశలో దాదాపు 10 గనులను వేలం వేయనున్నట్లు చెప్పారు.