ఈటల చిల్లర రాజకీయాలు చేయడు: కిషన్ రెడ్డి

Update: 2023-04-06 17:33 GMT
  • కేసిఆర్ కుటుంబం అబద్ధాల వర్సిటీలో పీహెచ్ డీ చేశారు
  • ఇంటలిజెన్స్ మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుంది
  • సింగరేణి రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థ
  • కేసీఆర్ కుటుంబం ప్రైవేటీకరణ చేయాలనుకుంటోంది
  • కొన్ని బ్లాకులు వేలం వేసింది
  • వారి నుంచి ఎన్ని వేలకోట్లు తీసుకున్నారు
  • సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా?..

దిశ, తెలంగాణ బ్యూరో  రాష్ట్రంలో పదో తరగతి హిందీ పేపర్ ప్రశ్న పత్రం లీకేజీకి సంబంధించిన మెసేజ్ వెళ్లిన ప్రతీ ఒక్కరికీ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తే తెలంగాణలో ఉన్న జైళ్లు సరిపోవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు ఇచ్చారని, ఇది మంచి పద్ధతి కాదని ఫైరయ్యారు. కేసీఆర్ లాగా.. ఈటల చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదని ఆయన పేర్కొన్నారు. తాము ప్రభుత్వ జీతగాళ్లు కాదని, సాయంత్రం 6 గంటలకు నోటీసులు ఇచ్చి 8 గంటలకు విచారణకు రావాలని హుకుం జారీ చేస్తే ఎలా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శిశుపాలుడి తప్పుల్లాగే కేసీఆర్ చేసే తప్పుల్ని కూడా జనాలు చూస్తున్నారని, ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రశాంత్ కొంతమంది జర్నలిస్టులకు సమాచారం ఇచ్చాడని, ఆ జర్నలిస్టులను కూడా పోలీసులు భయపెడుతున్నారన్నారు.

ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టులు భయపడొద్దని ఆయన భరోసా కల్పించారు. బేషరతుగా బండి సంజయ్ పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ సీపీ బుధవారం మాట్లాడుతూ ఈటలకు ప్రశాంత్ మెసేజ్ చేశాడని, కానీ ఆయన్ను విచారణకు పిలవడం లేదు కదా అని కామెంట్లు చేసి 24 గంటల్లోనే మాట ఎలా మార్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అబద్ధాల యూనివర్సిటీలో పీహెచ్ డీ చేశారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కేసిఆర్ రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థలను నాశనం చేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ఇంటలిజెన్స్ తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుందని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం తెలుసుకోవాలని ఆయన సూచించారు. సింగరేణి రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థ అని, సింగరేణిని ప్రైవేట్ పరం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్‌పరం చేస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. సింగరేణికి వచ్చిన గనుల వేలాన్ని ప్రైవేట్ వ్యక్తికి ఎలా కట్టబెట్టారని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కొన్ని బ్లాక్‌లను ప్రైవేట్ పరం చేశారని ఫైరయ్యారు. బొగ్గు బ్లాకుల అమ్మకాలపై సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ సర్కార్ సిద్దంగా ఉందా? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోడీ సైతం క్లారిటీ ఇచ్చినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే, కేవలం సింగరేణి ఎన్నికల కోసమే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.

Tags:    

Similar News