డబుల్ ఇండ్లపై వచ్చే నెల 4న బీజేపీ మహాధర్నా.. కేంద్ర మంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి గూడు లేని పేదలకు అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని కాషాయ పార్టీ ఉధృతం చేయనుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి గూడు లేని పేదలకు అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని కాషాయ పార్టీ ఉధృతం చేయనుంది. ఇప్పటికే బాట సింగారంలో డబుల్ ఇండ్ల పరిశీలనతో పాటు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. కాగా ఈ నెల 16, 17 తేదీల్లో బస్తీల సందర్శనను చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. మహాధర్నాలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగాలని సూచించారు.
వచ్చే నెల 4న రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాను హైదరబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. రజాకార్ల అడుగుజాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. వరదల్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉండదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లీ బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించక పోవడంపై నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతుందని మండిపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామకాల ఎజెండా తో తెచ్చుకున్న తెలంగాణను అప్పుల ఊబిలోకి దించారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా రాష్ట్రంలో పెరిగిపోయిందని, మోసం చేయడం, గొంతు కోయడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. కేసీఆర్ హామీలు మాటల్లో ఉంటాయి తప్ప చేతల్లో ఉండవని, డబల్ బెడ్ రూం ఇస్తామని గులాబీ గ్రాఫిక్స్ చూపించి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేసీఆర్ కి లేదన్నారు. హైదరాబాద్ కి పది లక్షల మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, 2015 నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం వేసిన శిలాఫలకాలను ప్రగతి భవన్ లో దాచి పెట్టారన్నారు.
గ్రేటర్ పరిధిలో 5 లక్షల మందికి గూడు లేదు.. ఈటల
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 లక్షల మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి వట్టి మాటలు చెప్పి పేదల కండల్లో కారం కొట్టారని విమర్శలు చేశారు. ఐడీహెచ్ కాలనీలో వంద ఇండ్లు కట్టి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో షో చేశారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కేంద్రం హడ్కో కింద రూ.9 వేల కోట్లు కేటాయించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పంచే దమ్ము కేసీఆర్ కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇస్తామని అంటున్నాడని, పెరిగిన ధరల కారణంగా రూ.3 లక్షలతో పునాదులు కూడా పూర్తి కావన్నారు.
గతంలో చెప్పిన ప్రకారం రూ.5 లక్షలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంకు మూడు నెలలు మాత్రమే ఉందని, ఆయన గృహలక్ష్మి పథకం కింద ప్రొసీడింగ్స్ మాత్రమే ఇస్తారని, కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇండ్లు తాము ఇస్తామని ధీమా వ్యక్తంచేశారు. సుమారు 5 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ ల్యాండ్ ను పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారని ఆయన ఆరోపించారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా చేయాలని నిరుద్యోగుల పక్షాన ఈటల డిమాండ్ చేశారు.