Kishan Reddy: మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు ఇంకా నోటిఫికేషన్ల కోసం అశోక్ నగర్ లైబ్రరీ వద్ద ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పేవన్నీ అబద్ధాలని, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతూ అక్కడి ప్రజలను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). శుక్రవారం సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో (Secunderabad Tourism Plaza) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని, కేసీఆర్ బాటలోనే ఆయన పాలన కొనసాగుతోందని విమర్శించారు. అసలు రేవంత్ మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ (Telangana Job Calendar)ను ప్రకటించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు ఇంకా నోటిఫికేషన్ల కోసం అశోక్ నగర్ లైబ్రరీ వద్ద ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలోనూ రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.