పట్టు విడువని నిరుద్యోగులు.. ఉదయం 3 గంటల సమయంలో ఆందోళన

గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Update: 2024-07-14 03:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. గ్రూప్-1 ఎగ్జామ్‌లో పోస్టులు పెంచాలని, డీఎస్సీ ఎగ్జామ్ వాయిదా వేయాలని రాత్రిపగలు తేడా లేకుండా అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-1 మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిని పాటించాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే టీజీపీఎస్సీ కమిషన్ ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగులు ధర్నాలు ఆపాలని తేల్చి చెప్పింది. 1: 50 నిష్పత్తితోనే మెయిన్స్ ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పందని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. పరీక్షలు వాయిదా వేయడం వల్ల కోచింగ్ సెంటర్లకు రూ. 100 కోట్ల లాభం వస్తుందని.. కోచింగ్ నిర్వాహకులు డబ్బు కోసం ఆశపడుతున్నారని అన్నారు. మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. ‘రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ధర్నాలు చేస్తున్నారు.. నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదు అని మాట్లాడడంపై మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై నిరుద్యోగులు మరింత మండిపడుతూ.. పట్టు విడువకుండా ధర్నాలు చేపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌తోపాటు, ఇతర అనేక చోట్ల వేలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాంగ్రెస్‌ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.   


Similar News