దారుణం.. కట్నం కింద ఇచ్చిన భూమి తిరిగివ్వాలని అల్లుడి బైక్‌కు నిప్పంటించిన మామ
మహబూబాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్నం కింద
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్నం కింద ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని అల్లుడి బైక్‌కు మామ నిప్పు పెట్టాడు. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అలాగే అల్లుడి మిర్చి పంటలో కలుపు మందు స్ప్రే చేసి ధ్వంసం చేశాడు. అల్లుడిపై పగతో మామ చేసిన ఈ పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో తండ్రిపై కుతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
కొత్తగూడం మండలం ఆదిలక్ష్మిపురం గ్రామానికి చెందిన కుసుమ మల్లేష్ కూతురు ధనలక్ష్మితో అదే గ్రామానికి చెందిన గోరేటి వేణుకు 2010లో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద వేణుకు మల్లేష్ రెండెకరాల పోలం ఇచ్చాడు. అయితే ఇప్పుడు భూముల ధరలు పెరగడంతో కట్నం కింద ఇచ్చిన రెండెకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని అల్లుడు, కూతురిని మల్లేష్ వేధిస్తున్నాడు. గత రెండేళ్లుగా వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కానీ ఎంతకూ అల్లుడు, కూతురు వినకపోవడంతో వారిపై మల్లేష్ మరింత కక్ష పెంచుకున్నాడు. దీంతో పంటను ధ్వంసం చేయడంతో పాటు అల్లుడి బైక్‌కు నిప్పంటించాడు.