నాయకుల మధ్య ఆగని ఆధిపత్య పోరు
‘‘ ఆధిపత్య పోరు.. మేమే మోనార్క్ లం ’’ అనే వైఖరితో శేరిలింగంపల్లి నియోజకవర్గ కమలం పార్టీలో కల్లోలం నెలకొంది.
దిశ, శేరిలింగంపల్లి : ‘‘ ఆధిపత్య పోరు.. మేమే మోనార్క్ లం ’’ అనే వైఖరితో శేరిలింగంపల్లి నియోజకవర్గ కమలం పార్టీలో కల్లోలం నెలకొంది. బీజేపీలో అంతర్గత కలహాలు ఇప్పుడే సద్దుమణిగేలా లేవు. ఒకరిద్దరు నాయకులతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజాతుందని స్వయంగా పార్టీకి చెందిన మరికొందరు నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం పార్టీ పటిష్టత కోసం ఐక్యంగా పనిచేయాలని ఆదేశించగా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడి నేతలు. టికెట్ రేసులో మేమంటే మేమంటూ పోటీలు పడి ఎవరికి వారు పర్యనటనలు, పాదయాత్రలు చేస్తున్నారు. తగ్గేదే లేదంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అంతటితో ఆగని నేతలు వర్గాల వారీగా విడిపోయి వీధి కొట్లాటలకు సైతం దిగుతున్నారు. దీంతో క్యాడర్ ను పరేషాన్ చేస్తున్నారు. మొత్తంగా బీజేపీ పరువును బజారుకీడుస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
నడిపించే లీడర్ లేకనే..
శేరిలింగంపల్లిలోని పలు డివిజన్లలో పార్టీకి చెప్పుకోతగ్గ క్యాడర్ ఉంది. పార్టీ అనుబంధ సంఘాలు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గచ్చిబౌలి కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి గెలిచారు. కానీ నియోజకవర్గాన్ని నడిపించే లీడర్ లేకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి నడిపించే నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఒక్కరు కూడా లేరని ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పించడం గమనార్హం. అధిష్టానం అందరినీ సమన్వయం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్లను నియమించింది. కానీ శేరిలింగంపల్లికి కన్వీనర్ వచ్చినా పార్టీ తీరు మాత్రం మారడం లేదు.
అంతా హడావుడే..
కొందరు నేతల హడావుడి, వారు చేసే ఆర్భాటాలు పార్టీ అనిశ్చితికి కారణమవుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ప్రచారం పేరిట ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. వారి హడావుడితో పార్టీకి ప్రోగ్రెస్ లేకపోగా రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా అయితే పార్టీ ముందుకు నడిచేదెలా..? ఓటర్లను ఆకట్టుకునేదెలా..? అన్నది పార్టీ పెద్దలను వేధిస్తున్న ప్రశ్నలు. కూడా అంతు చిక్కడం లేదట. శేరిలింగంపల్లి పరిస్థితిపై రాష్ట్ర అధిష్టాన పెద్దలు ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే పార్టీకి ఇక్కడ ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ అభిమానులు, అనుబంధ సంఘాల శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..