కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచిన సీఎం స్పీచ్..!
ప్రజాపాలన విజయోత్సవం సభ ప్రభుత్వ కార్యక్రమమైనా.. కాంగ్రెస్‌లో మాత్ర ఎనలేని జోష్‌ను నింపింది.
దిశ, వరంగల్ బ్యూరో : ప్రజాపాలన విజయోత్సవం సభ ప్రభుత్వ కార్యక్రమమైనా.. కాంగ్రెస్‌లో మాత్ర ఎనలేని జోష్‌ను నింపింది. వరంగల్ అభివృద్ధికి సమీప భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు ప్రారంభం, వరంగల్‌లో అండర్ డ్రైనేజీ నిర్మాణం, ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్‌కు ఆమోదంతో పాటు మౌలిక వసతుల మెరుగు.. నగరాభివృద్ధికి కావాల్సిన అన్నీ చర్యలు తీసుకుంటామని.. రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో రేవంత్ రెడ్డి వాగ్దనాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏం చేయడం లేదనే విమర్శలతో.. ఒకరకంగా ఎమ్మెల్యేలయితే క్యాడర్ వద్ద చెప్పుకోలేక ఇబ్బందులు పడ్డారు.
జిల్లా ఇన్చార్జిమంత్రి పొంగులేటి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల వినతులను మంత్రివర్గం, సీఎం చాలా సీరియస్‌గా తీసుకుంటూ అభివృద్ధికి వ్యూహ రచన చేసినట్లుగా స్పష్టమవుతోంది. మాటలు చెప్పకుండానే.. నిధుల మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో అంకురార్పణ చేస్తుండటంపై ఓరుగల్లు ప్రజానీకం నుంచి హర్షం వ్యక్తమవుతోంది.వరంగల్ అభివృద్ధికి కీ పాయింట్స్‌గా మారిన ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు , లింకు రోడ్లు, ప్రధాన రహదార్లు, ఓరుగల్లు ప్రజల కలల అండర్ డ్రైనేజీ వంటి కీలకాంశాలపై ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ప్రజలు అభినందిస్తున్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వర్గాలకు బూస్ట్‌గా మారింది. అధికారంలోకి వచ్చి ఏం చేయలేకపోతున్నామనే అసంతృప్తి నుంచి.. ఇది కదా అసలైన అభివృద్ధి అంటే చర్చ పెడుతున్నారు.
కాన్ఫిడెన్స్ పెంచిన సీఎం స్పీచ్..!
ఈ సభకు ముందు మూడు రోజుల నుంచి వరుసగా వరంగల్‌పై నిధుల వరద పారింది. ఏకంగా రూ. 5వేల కోట్ల పనులకు నిధులను శాక్షన్ చేసింది. వరంగల్ అభివృద్ధి విషయంలో ఇన్ని వేల కోట్ల నిధులు ఒకేసారి దక్కడం ఎప్పుడు జరగలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌వాదులు తమ ప్రభుత్వం చేసిన దానికి ఉబ్బితబ్బిబవుతున్నారు. అప్పుడే అయిపోలేదు.. ఇంకా చాలా ఉంది..ఇది ఆరంభమే అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క్ వరంగల్‌కు వరాల జల్లుపై మరిన్ని ఆశలు పెంచారు. రెండో రాజధానిగా చేసి తీరుతామని, అంత వరకు నిద్రపోమని సీఎం వాగ్దానించడం గమనార్హం. ఇప్పటికే గత ఎన్నికల సమయంలో చేసిన వాగ్దనాలను నెరవేర్చిన నేపథ్యంలో కొత్త అంశాల అభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి. అభివృద్ధి అంశాలకు ఎన్ని నిధులైన కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ నేతల్లో, ప్రజాప్రతినిధుల్లో కాన్ఫిడెన్స్ పెరిగినట్లయింది.
నిజమే..! ఇది విజయోత్సవమే..!
ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభ గ్రాండ్ సక్సయింది. మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడం, ఎయిర్ పోర్టు భూ సేకరణకు రూ. 205 కోట్లు మంజూరు చేయడం, మున్సిపల్ పరిపాలన భవనం శంఖుస్థాపనకు - 32.50 కోట్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ శంఖుస్థాపన - 4170 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల శంఖుస్థాపన - 28 కోట్లు, ఇంటర్నల్ రింగ్ రోడ్ శంకుస్థాపన - 80 కోట్లు, వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన - 3 కోట్లు, ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం శంఖుస్థాపన - 160.3 కోట్లు, రహదారుల అభివృద్ధి - 49.50 కోట్లు, పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్డు 4 లైన్ల విస్తరణ - 6.50 కోట్లు కేటాయించడం..మొత్తంగా ఓరుగల్లులో అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ. 5వేల కోట్ల నిధులను మంజూరు చేయడంతో సభలో నేతలు, జనాల మధ్య ఇదే డిస్కషన్ నడిచింది. పొలిటికల్, అధికార యంత్రాంగం కలగలిపినట్లుగా సాగిన ఈ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.ఈ సభకు పెద్ద సంఖ్యలో మహిళలను సభకు తరలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసినా.. వాహనాలు ఎక్కడికక్కడే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. వడ్డెపల్లి, కాజీపేట రూట్లలో చాలా చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రేవంత్ పేరు మార్మోగింది.