TS RTC డ్రైవర్లకు 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' అవార్డులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి రెండు జాతీయ అవార్డులు వరించాయి.

Update: 2023-02-25 14:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. రహదారి భద్రత కేటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) శనివారం ప్రకటించింది. కుషాయిగూడ డిపోకు చెందిన కే.రంగారెడ్డి, సూర్యాపేటకు డిపోకు చెందిన కే.సోమిరెడ్డిలు అవార్డులకు ఎంపికయ్యారు. తమ సర్వీస్‌లో ప్రమాదరహితంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఈ పురస్కారాలు వారికి లభించాయి. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఈ అవార్డులను ఏఎస్‌ఆర్టీయూ ప్రకటించింది.

ఈ అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ ఏప్రిల్‌ 18న న్యూఢిల్లీలో విజేతలకు అందజేస్తారు. అవార్డు వరించిన ఇద్దరు డ్రైవర్లు కే.రంగారెడ్డి, కే.సోమిరెడ్డిలకు సర్టిఫికేట్‌, నగదు పుర‌స్కారంతో పాటు ట్రోఫీలను అందజేసి సత్కరిస్తారు. అయితే తమ సంస్థకు చెందిన ఇద్దరు డ్రైవర్లకు 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించడంపై టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ లు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన కె రంగారెడ్డి, కె సోమిరెడ్డిలను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ..ఈ పురస్కారాలు టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేశాయన్నారు. సంస్థలోని మిగతా డ్రైవర్లు కూడా వీరి సేవ‌ల్నిస్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డ్రైవింగ్ ఒక సవాల్ గా మారిందని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనదారుల, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తూ.. ప్రమాదాల నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News