కేంద్ర కేబినెట్‌లోకి తెలంగాణ నుంచి ఇద్దరు?

కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఆయనను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించడం దాదాపుగా ఖరారైంది.

Update: 2023-07-05 02:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఆయనను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించడం దాదాపుగా ఖరారైంది. ఒకరికి ఒక పదవి మాత్రమే అనే విధానాన్ని బీజేపీ కొనసాగిస్తున్నది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందున కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే తాత్కాలికంగా కొంతకాలం కంటిన్యూ చేసే అవకాశమున్నది.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. మరోవైపు ఇప్పటిదాకా బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించడంతో సముచితమైన స్థానం కల్పిస్తామని జాతీయ అధ్యక్షుడు నడ్డా హామీ ఇవ్వడంతో కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశమున్నది.

ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావును సైతం బీజేపీ అధిష్టానం మంగళవారం ఢిల్లీకి పిలిపించింది. జేపీ నడ్డాను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమనే సిగ్నల్ ఇచ్చినట్లయింది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని కొంతకాలం క్రితం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.

అందులో భాగంగా కిషన్‌రెడ్డిని తొలగిస్తున్నందున ఇకపై బండి సంజయ్, సోయం బాపూరావ్‌లకు ఆ అవకాశం లభించనున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల వ్యవధిలో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనున్నది. ఇండిపెండెంట్ మంత్రి పదవి దక్కుతుందా లేక సహాయ మంత్రి పదవులు వస్తాయా అనేది తేలనున్నది.రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడని సమయంలో ఆయన హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రోగ్రామ్‌లో ఉన్నారు. అది ముగిసిపోయిన తర్వాత తొలుత ఖరారైన షెడ్యూలు ప్రకారం కర్నాటలోని హంపికి వెళ్ళాల్సి ఉన్నది. కానీ ఆ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుని నేరుగా ఢిల్లీ వెళ్ళారు.

పార్టీ అధ్యక్ష పదవి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు గత వారమే లీకులు వెలువడినా అలాంటి మార్పు ఉండదంటూ బదులిచ్చారు. గతంలోనే అధ్యక్షుడిగా పనిచేసినందున మళ్ళీ ఆ బాధ్యతల్లోకి వెళ్ళడమంటే డీమోట్ చేయడమేనని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది. కేంద్ర మంత్రి పదవిని వదులుకోడానికి మానసికంగా సంసిద్ధంగా లేరని వారి ద్వారా తెలిసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో తన అభిప్రాయాన్ని ఏ రూపంలో వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభకు 2019లో జరిగిన ఎన్నికల తర్వాత కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా కొనసాగుతూనే దాదాపు ఆరు నెలల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అప్పుడు జేపీ నడ్డా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఆ తరహాలోనే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగేంతవరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూనే కేంద్ర మంత్రివర్గంలోనూ కంటిన్యూ అయ్యేలా ప్రధానిని రిక్వెస్టు చేస్తారా అనే చర్చ మొదలైంది. ప్రధాని తీసుకునే నిర్ణయంపై కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సమావేశంలోనే బండి సంజయ్, సోయం బాపూరావు విషయంలోనూ కేంద్ర క్యాబినెట్‌లో స్థానం దక్కుతుందా లేదా అనేది కూడా స్పష్టతకు రానున్నది.

Also Read: థర్డ్ టైం బీజేపీ స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి.. ఆయన రాజకీయ ప్రస్థానమిదే!

Tags:    

Similar News