ఫోన్ ట్యాపింగ్ లో కేసులో ట్విస్ట్.. పీఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్.. ఒకే రోజు 40 ఫోన్లు ట్యాపింగ్..
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తవ్విన కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దిశ, క్రైమ్ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తవ్విన కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆసరగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రుల స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేసినట్లు తేలింది.ఈ మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న వ్యవహారంపై పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా పీఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతి పరుల పై దాడులు నిర్వహించి డబ్బులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కొల్లూరులో రేవంత్‌రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, రేవంత్ రెడ్డి మరో మిత్రుడు కె. వినయ్‌రెడ్డి దగ్గర నుంచి రూ. 1.95 కోట్లు సీజ్ చేసినట్లు ఈ రిపోర్ట్ లో వెల్లడించారు. ప్రస్తుత మంత్రులైన ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి డబ్బులను తిరుపతన్న పట్టుకున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా నుంచి రూ. 10.5 కోట్లు సీజ్ చేయగా, పొంగులేటి మిత్రుడు ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, ఎమ్మెల్యే జి.వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్న తిరుపతన్న.. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి తో పాటు కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపైనా నిఘా పెట్టినట్లు దర్యాప్తు అధికారులు కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
తిరుపతన్న కీలకం:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించిన తిరుపతన్న.. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 10 పదిమంది కానిస్టేబుల్లు, పదిమంది హెడ్ కానిస్టేబుల్ తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారని, ప్రతి రోజు కూడా 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ కు పాల్పడినట్లు ఈ కస్టడీ రిపోర్ట్ లో వెల్లడించారు. ఇలా మొత్తం 300 మంది ఫోన్లను ట్యాపింగ్ కు పాల్పడినట్లు పేర్కొన్నారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో కలిసి పని చేసిన పని చేశారని, ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డేటా మొత్తాన్ని ధ్వంసం చేసిన తిరుపతన్న.. తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతోపాటు 9 లాగర్స్‌లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేశారని దీంతో దశాబ్ధాల తరబడి మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్:
భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారి పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు విచారణ జరపనున్నది.