ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై గద్దర్ పాట రాసి సంస్థకు అంకితం చేస్తానన్నారు: సజ్జనార్
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తాననిచెప్పారని, అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తాననిచెప్పారని, అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించి, గద్దర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచిపోయారని కొనియాడారు.
''గద్దర్‌తో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారు." అని సజ్జనార్ గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్ భావించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారని అన్నారు. గద్దర్ పార్ధివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.