TSPSC పేపర్ లీక్ కేసు: హైకోర్టుకు చేరిన సిట్ నివేదిక
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒక సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒక సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దర్యాప్తు పాదర్శకంగా జరుగుతూ ఉన్నదని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఒక్కరిని మినహా మిగిలిన 17 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఆ ఒక్కరు న్యూజిలాండ్‌లో ఉన్నందున అరెస్టు చేయలేదని, ఇక్కడకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, అందువల్లే సీబీఐకి అప్పగించాలని కోర్టును కోరుతున్నామన్నారు.
ఒకవైపు దర్యాప్తు జరుగుతుండగానే పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారని, దీంతో దర్యాప్తులో పారదర్శకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దర్యాప్తు వివరాలు బైటకు లీక్ కాకూడదన్న ఉద్దేశంతో సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తుండగా మంత్రికి వివరాలు ఎలా లీక్ అవుతాయని ప్రశ్నించారు. దర్యాప్తులో నిందితుల నుంచి అనేక కీలక వివరాలు లభ్యమయ్యాయని ఏజీ వివరించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్.. ప్రశ్నాపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతాయని ప్రశ్నించింది. ఒకవేళ ఆన్‌లైన్ విధానం అనుకున్నట్లయితే దాని యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లు ఎవరెవరికి తెలిసే అవకాశముందని ప్రశ్నించింది. సీల్డ్ కవర్ నివేదికను పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభమవుతుందని పేర్కొన్న బెంచ్ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
Also Read..