నేతలకు టీఆర్ఎస్ హెచ్చరిక.. మునుగోడులో వింత పరిస్థితి

దిశ, తెలంగాణ బ్యూరో: సొంతపార్టీ నేతలకు పార్టీ నాయకత్వం మొండి చెయి చూపుతోంది. ఇతర పార్టీల నుంచి చేరేవారికి

Update: 2022-08-22 01:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సొంతపార్టీ నేతలకు పార్టీ నాయకత్వం మొండి చెయి చూపుతోంది. ఇతర పార్టీల నుంచి చేరేవారికి మాత్రం అక్కున చేర్చుకోవడంతో పాటు నిధులు, తాయిలాలు ఇస్తుంది. దీంతో నేతలు గులాబీ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అంతేగాకుండా మునుగోడు బైపోల్ నేపథ్యంలో అధికారపార్టీ నేతలు పార్టీ మారకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పార్టీమారితే వారి లావాదేవీలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళికలతో పాటు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లు సమాచారం.

ఉపఎన్నికలు జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ మారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎవరెవరూ పార్టీ మారే అవకాశం ఉందో వారి వివరాలను సేకరిస్తున్నారు. పార్టీ మారితే జరుగబోయే చర్యలు వివరిస్తూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు గతంలో చేసిన పనుల బిల్లులను సైతం నిలివేస్తామని, పార్టీలో ఉంటేనే విడుతల వారీగా నిధులు విడుదలతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. అయినా ఎవరైనా మాట వినని వారు చేస్తున్న బిజినెస్ లు, వారి ఆర్థిక మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. వారిని ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ సమాచారం.

ఇతర పార్టీల నుంచి చేరేవారికి నిధులు, తాయిలాలు

గులాబీ పార్టీ నేతలు సొంతపార్టీ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను మాత్రం విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి చేరే నేతలకు మాత్రం తాయిలాలు ఇస్తున్నారు. గ్రామసర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఇలా వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి డిమాండ్ ఉంది. సుమారు 10 లక్షల నుంచి 40లక్షల వరకు ఇస్తున్నారు. అవి కూడా విడుతల వారీగా ఇస్తున్నారు. అంతేకాదు గ్రామంలో డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు సైతం 10 నుంచి 20లక్షలు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పది మందికి పైగా, ఎంపీటీసీ, సర్పంచులను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. వారికి నిధుల విడుదలకు సైతం హామీ ఇస్తున్నారు. గ్రామాల్లో పెండింగ్ పనుల పూర్తికి సైతం నిధులు మంజూరు చేస్తుంది అధికార పార్టీ. అయితే సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు పార్టీ మారకుండా అభివృద్ధి నిధులను సైతం హోల్డ్ లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదీ ఏమైనప్పటికీ సొంత పార్టీ నేతల్లోనే నిధుల వ్యత్యాసంపై అసంతృప్తి ఉండటం ఉప ఎన్నికల్లో ఎటు దారితీస్తుందోనని పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. 

అధికార పార్టీ వైపు ఎర్ర పార్టీలు.. భవిష్యత్తులో కూడా పొత్తులేనా?  


Similar News