ప్రభుత్వాలను కూలగొట్టడం ప్రజాస్వామ్యమా?

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించిన టీఆర్ఎస్ ఎంపీ కేకే, దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా విపక్షాలతో కలిసి ఈ సమావేశాల్లో కొట్లాడుతామని అన్నారు.

Update: 2022-12-06 09:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించిన టీఆర్ఎస్ ఎంపీ కేకే, దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా విపక్షాలతో కలిసి ఈ సమావేశాల్లో కొట్లాడుతామని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని, కానీ 17 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సుమారు పాతిక బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదింపజేసుకోవాలనుకుంటున్నదని, ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరించడం లేదన్నారు. విపక్షాలపై ఉద్దేశపూర్వకంగానే రాజకీయ ప్రతీకార ధోరణితో బీజేపీ వ్యవహరిస్తున్నదని, కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ వాటి అధికారాలను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. ఈ దాడులతో విపక్షాల ప్రభుత్వాలు భయభ్రాంతులకు గురయ్యే వాతావరణాన్ని సృష్టిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ కలుపుకుని టీఆర్ఎస్ కొట్లాడుతుందన్నారు.

సింగరేణి బొగ్గు గనుల విషయంలోనూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసిందన్నారు. బొగ్గు దిగుమతిపై ఆంక్షల పేరుతో ఇలా వ్యవహరిస్తున్నదని, తక్షణమే దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని, కనీసంగా సగం సమయాన్ని దానికి కేటాయించేలా ప్లానింగ్ చేయాలని అఖిలపక్ష సమావేశంలో సూచించినట్లు కేకే గుర్తుచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 'చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు'పై చర్చ జరగాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు నిర్దిష్టంగా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను, పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతామన్నారు.

Tags:    

Similar News